TDP Chief Chandrababu Naidu Interview : ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. అధికార వైసీపీ అన్నింట్లోనూ పూర్తిగా విఫలమైందని, హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ప్రజలంతా గ్రహించారని తెలిపారు. దీంతో ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 25కి 24 లోక్‌సభ సీట్లు, 175కి 160 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేత హోదా సాధించాలని గతంలో ఎంతగానో ప్రయత్నించామని, కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గత అయిదేళ్లుగా ఆ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించారు. దీంతో ప్రస్తుతం తాను పోరాడినా సరే అంతగా ఉపయోగం లేదని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేశారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అన్ని రంగాల్లోనూ అవినీతి పేరుకుపోయిందని విమర్శించారు.
అప్పుల్లో కూరుకుపోయింది: రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఉద్యోగులుక జీతాలు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజల్లో అధికార పార్టీపై విపరీతమైన వ్యతిరేకత ఉందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ వైఖరి చూశాకా, ఏ పార్టీ అభివృద్ధి చేస్తుందో ప్రజలకు తెలిసిందని చెప్పారు.
వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Slams YSRCP
అందుకే టీడీపీ- జనసేన- బీజేపీ కలిశాయి: ఏపీలో భారతీయ జనతా పార్టీకి బలం లేకపోయినా సరే, రాష్ట్రంలో ప్రజలు కష్టాలు తీర్చేందుకే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల కంటే వైసీపీ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బాధలను మరోసారి చూడాలి అనుకోవడం లేదని, అందుకే టీడీపీ-జనసేన-బీజేపీ కలిశాయన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకొస్తామని తెలిపారు. ఆంధ్ర ప్రజలకు మంచి భవిష్యత్తును ఇస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో నీళ్లు, కరెంటు, సరైన రోడ్లు లేవని చంద్రబాబు చెప్పారు. సామాన్య ప్రజలు తమకు వచ్చిన తక్కువ వేతనాలతో రాష్ట్రంలో బతకడం కష్టంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులలో అధికారులు ఎవరూ ఆంధ్రప్రదేశ్‌లో పని చేయడానికి ఇష్టపడట్లేదని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ విధంగా వైసీపీ మోసం చేసిందో ప్రజలంతా చూశారని, అందుకే కూటమికి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయించారన్నారు.
పవన కల్యాణ్ భిన్నమైన వ్యక్తి: సాధారణంగా సినీ నటులను చూసేందుకు జనాలు భారీగా వస్తారు, కానీ అవి ఓట్లుగా మారవు కదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, చాలా మంది సినీనటుల కంటే పవన కల్యాణ్ భిన్నమైన వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. ఆయనకు రాష్ట్రంలో మంచి ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. అందుకే పవన్ కల్యాణ్‌తో కలిశామని స్పష్టం చేశారు.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం: 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, మరెన్నో సంక్షోభ పరిస్థితులను చూసిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన ప్రతి సారీ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని, మరోసారి ఓటు వేసి ప్రజలు గెలిపిస్తే నవ్యాంధ్రను నిర్మిస్తామని తెలిపారు.
అభివృద్ధికి టీడీపీ బ్రాండ్: కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ముక్కోణపు పోరులో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చుతుందా అనే ప్రశ్నకు చంద్రబాబు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అదే విధంగా తన అరెస్టుపై కూడా చంద్రబాబు స్పందించారు. వైసీపీ పాలనలో ఏపీలో తాను ఒక్కడిని మాత్రమే కాకుండా ప్రజలంతా బాధితులేనని అన్నారు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అని మరోసారి రుజువు చేస్తామన్నారు.
అయితే ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేర్చకపోవడంతో పాటు, కేంద్రం నుంచి తగినంతగా నిధులు రాకపోవడంతో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకువచ్చింది. అంతకుముందు 2018 లోనే టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు పరిమితమైంది. కాగా ప్రస్తుతం 2024 మే 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 6 పార్లమెంట్ స్థానాల నుంచి బరిలో దిగుతున్నారు. అదే విధంగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - Chandrababu At TDP workshop