Parliament Elections Nominations in Telangana : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు రెండో రోజు నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరుగా సాగింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు పదిహేను పార్లమెంటు స్థానాల్లో 57 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 57 మంది అభ్యర్థుల నుంచి 69 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రెండ్రోజుల్లో మొత్తం 98 మంది అభ్యర్థులు 117 నామినేషన్లు దాఖలు చేశారు.
ఆదిలాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూలు, ఖమ్మంలో ఒక్కొక్కరు. హైదరాబాద్‌లో ఇద్దరు, పెద్దపల్లి, చేవెళ్ల, వరంగల్‌లో ముగ్గురు. మెదక్, నల్గొండ, మహబూబాబాద్‌లో నలుగురు. మల్కాజిగిరి, భువనగిరిలో అయిదుగురు కాగా నిజామాబాద్, సికింద్రాబాద్‌లో ఆరుగురు చొప్పున నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు మల్కాజిగిరిలో అత్యధికంగా 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
NO Nomination in Cantonment : ఉపఎన్నిక జరుగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వంశీచంద్ ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మురళినాయక్, రాంచంద్రునాయక్ సహా పలువురు పాల్గొన్నారు. అంతకుముందు బలరాంనాయక్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
BJP MP Candidate Kishan Reddy Nomination : సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నాలుగు సెట్ల నామినేషనన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. నిజామాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు వెళ్లిన పసుపు రైతులు, అర్వింద్‌కు నామినేషన్ డిపాజిట్ ఫీజు అందించారు.
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున, ఆయన కుటుంబసభ్యులు రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. భువనగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండగేకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు పట్టణంలోని రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్‌కు నామపత్రాలు సమర్పించారు.
BRS Candidate RS Praveen Kumar Nomination : నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్‌రెడ్డి, జైపాల్ యాదవ్‌తో కలిసి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్‌లో మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పెద్దపల్లి లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేశారు. హైదరాబాద్ లోక్‌సభ ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఒవైసీ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఓవైసీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులూ రెండోరోజు నామినేషన్లు వేశారు.