Deputy CM Bhatti Attend Sarvai Papanna Goud Jayanthi Celebrations : రాజ్యాంగం, చట్టాలు లేని రోజుల్లోనే ప్రజల హక్కుల కోసం సర్వాయి పాపన్న పోరాడారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మొఘల్ సైన్యాన్ని సైతం ఎదిరించి నిలబడిన వీరుడు పాపన్న అని కొనియాడారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 374వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు తెలియజేయాలని వెల్లడించారు. సర్వాయి పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పాపన్న గౌడ్ పర్యాటక కేంద్రానికి రూ.4.70 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశామని వివరించారు.
పాపన్న గౌడ్ పర్యాటక కేంద్ర నిర్మాణ బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్ చూసుకుంటారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాపన్న గురించి ప్రజలు తెలుసుకునేలా పాకెట్ పుస్తకాలను ముద్రిస్తామన్నారు. గోల్కొండ కోటలను కూడా కొల్లగొట్టిన సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమైందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యానికి కూడా సర్వాయి పాపన్న ఆలోచనలే మార్గదర్శకం అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న పాటుపడ్డారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణ ప్రజానికం ఆలోచించే రోజు : తెలంగాణలో బడుగు బలహీనవర్గాలను ఆలోచింపచేసే రోజు ఇది అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నేడు ప్రజాస్వామ్య పద్ధతిలో పెన్ను ద్వారా పోరాటం, ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలని మంత్రి వివరించారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాడిన విధానాన్ని మార్గదర్శకత్వంగా తీసుకోవాలన్నారు.
"సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బడుగు వర్గాల కోసం పాటుపడ్డారు. భవిష్యత్తు తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు తెలియాలి. సర్వాయి పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం. పాపన్న గౌడ్ పర్యాటక కేంద్రానికి రూ.4.70 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశాం. పాపన్న గౌడ్ పర్యాటక కేంద్ర నిర్మాణ బాధ్యత మంత్రి పొన్నం చూసుకుంటారు. పాపన్న గురించి ప్రజలు తెలుసుకునేలా పాకెట్ పుస్తకాలను ముద్రిస్తాం." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం