RS Praveen Kumar on BRS Leader Murder Case : కేసీఆర్ రాష్ట్రంలో నీళ్లు పారిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి సొంత జిల్లాలో రక్తపుటేరులు పారిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో రోజురోజుకు శాంతి భద్రతలు అడుగంటుతున్నాయని అన్నారు. ప్రజలు, ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి అండతో కాంగ్రెస్ కార్యకర్తలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. డీజీపీని కలిసిన పది రోజుల్లోనే కొల్లాపూర్ నియోజవర్గంలో శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందని తెలిపారు. హోంశాఖ సీఎం వద్దే ఉండి 48 గంటలు జరిగినా ఒక్క నిందితున్ని కూడా పట్టుకోలేదని ఆక్షేపించారు.
RS Praveen Kumar Fires on Minister Jupally : మంత్రి జూపల్లి మృతుని వ్యక్తిత్వాన్ని కించపరిచే నీచమైన స్థాయికి దిగజారుస్తున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. నిందితున్ని దాస్తున్నారని అలాంటి సంస్కృతి ఆయనకే ఉందని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ సంస్కృతి పడగ విప్పుతోందని డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి కేసులో సిట్ వేసి దర్యాప్తు జరపాలని, కొల్లాపూర్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని దీనికి రేవంత్ రెడ్డి, జూపల్లి బాధ్యత వహించాలని అన్నారు.
భూతగాదాలు ఉంటే హత్యలు చేస్తారా : జూపల్లి మంత్రిగా కాకుండా వీధిరౌడీ భాష మాట్లాడుతున్నారని, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి హత్య జరిగిన కుటుంబం బాధ చెబితే అబద్దాలు మాట్లాడుతున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. భూ తగాదాలు ఉంటే హత్యలు చేస్తారా అని ప్రశ్నించిన ఆయన అధికారం ఉందని విర్రవీగుతున్నారని, అరాచక పనులతో రాజ్యం ఏలాలని అనుకుంటున్నారని ఆక్షేపించారు. జూపల్లి సొంత గ్రామం పెద్ద దగడలోని గోడౌన్లో పౌరసరఫరాల శాఖ బియ్యం దోపిడీ చేస్తే మంత్రి కనీసం స్పందించలేదని ఆరోపించారు.
"బాధ్యత కలిగిన మంత్రిగా ఉండి పోలీసు విచారణను ప్రభావితం చేసేలా ఎలా మాట్లాడతారు?. సీఎం వెంటనే స్పందించి బీఆర్ఎస్ నేతలకు రక్షణ కల్పించాలి. శ్రీధర్ రెడ్డి కేసులో సిట్ వేసి దర్యాప్తు జరపించాలి. శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లి అనుచరుడు కారణమని అతని తండ్రి స్పష్టంగా చెప్పారు."- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత