Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఈనేపథ్యంలో ఆయా పార్టీల కీలకనేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా, ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టిసారించిది. సీఎం రేవంత్రెడ్డి సభలు, సమావేశాలతో ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈనేపథ్యంలో ప్రచారంలో మరింత జోష్ పెంచడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో రేపటి నుంచి మే 10వ తేదీ వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రేపు ఉదయం నాంధేడ్ నుంచి నేరుగా నిర్మల్లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్నారు. అక్కడ అదిలాబాద్ అభ్యర్ధి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
ఆ తరువాత అక్కడి నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని అలంపూర్ ఎర్రవల్లి కూడలి వద్ద జరగనున్న ఎన్నికల ప్రచార సభకు సాయంత్రం 5 గంటలకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి ఈ నెల 9న ఉదయం కరీంనగర్, సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు. ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఉండాల్సిన ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, షాద్‌నగర్‌లల్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు వివరించారు.
దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రధాన అంశంగా సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది, గాడిద గుడ్డేనంటూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అయిదు గ్యారెంటీ పథకాలు, వచ్చే ఆగస్టు పంధ్రాగస్టు నాటికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రధాన అజెండాగా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణనలో జాప్యం : సీఎం రేవంత్ - CM Revanth Jana Jatara Sabha