PM Modi Participate in Medak District Lok Sabha Election Campaign : పదేళ్లలో దేశమెంత అభివృద్ధి చెందిందో అంతా చూశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అందరూ చూశారన్నారు. ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుంటే భారత్‌ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టి వేసిందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లాలోని అల్లాదుర్గంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట పంచసూత్రాలతో పాలన చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ పంచసూత్రాలు అంటే అవినీతి, అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, కుటుంబ రాజకీయాలు అని ఎద్దేవా చేశారు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఈ పంచసూత్రాల పాలన ప్రజలకు అర్థమైందని వారి మాయలో ప్రజలు పడొద్దని హెచ్చరించారు. ఓటమి నైరాశ్యంలో కాంగ్రెస్ నేతలు దిగజారుతున్నారని పీఎం మోదీ విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియో సృష్టించారన్నారు. ఆ ఫేక్ వీడియోలను విడుదల చేసేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. విపక్ష కాంగ్రెస్‌కు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, చరిత్రలో ఎన్నడూ రానంత తక్కువ సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని జోస్యం చెప్పారు.
తెలంగాణ డబుల్ ఆర్ ట్యాక్స్ : తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి దిల్లీకి కప్పం కడుతున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఆర్ ట్యాక్స్ తక్షణమే ఆపాలని కాంగ్రెస్‌కు హెచ్చరించారు. వ్యాపారులు, గుత్తేదార్లు దొడ్డిదారిలో డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతున్నారని ఆరోపణలు చేశారు. పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మన సంపదను దోచుకుంటుందని అన్నారు. ఇందులో 55 శాతం కాంగ్రెస్ తీసుకుంటుందని హెచ్చరించారు.
మొన్నటి వరకు తెలంగాణను బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కుంభకోణంపై కాంగ్రెస్ మాట్లాడిందని, కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ స్కామ్‌ను తొక్కిపెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం సహకరించుకుంటున్నారని తెలిపారు.
"రైతులను భగవత్ స్వరూపాలుగా బీజేపీ చూస్తుంది. 100 రోజుల్లో రుణమాఫీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీను కాంగ్రెస్ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. బీజేపీ వల్లే మహిళలకు రక్షణ. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ ఉంటుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం 500 ఏళ్ల భారతీయుల స్వప్నం." - నరేంద్ర మోదీ, ప్రధాని
ఓట్ల కోసమే ముస్లింలకు రిజర్వేషన్లు : '2004-09లో ఉమ్మడి ఏపీలో అత్యధికంగా కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసింది. ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చింది. ఓట్ల కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ అనుకూలం. లింగాయత్‌ల రిజర్వేషన్లకు వ్యతిరేకం. రిజర్వేషన్లు, రాజ్యాంగంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. మాదిగలకు అండగా ఉంటాను. ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలం. రాజ్యాంగంపై, అంబేడ్కర్‌పై కాంగ్రెస్‌కు గౌరవం లేదు. తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేశారు. రాజకీయ అవసరాల కోసం ఇందిరా రాజ్యాంగానికి తూట్లు పొడిచారని' ప్రధాని మోదీ అన్నారు.
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కించపరిచింది : 'ఓ బిల్లు అంశంలో ప్రధాని మన్మోహన్‌ను రాహుల్ అవమానించారు. రాజ్యాంగం అంటే పవిత్ర గ్రంథంగా భావిస్తాం. రాజ్యాంగం రచించి 60 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఊరేగింపు చేశాను. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏనుగుపై రాజ్యాంగాన్ని పెట్టి ఊరేగించాను. రాజ్యాంగం పట్ల నాకున్న గౌరవంపై మీరు శంకించాల్సిన అవసరం లేదు. పార్లమెంటులోకి అడుగుపెట్టేముందు రాజ్యాంగానికి, పార్లమెంటుకు నమస్కారం చేశాను. కాంగ్రెస్ దేశ రాజ్యాంగాన్ని, పార్టీ రాజ్యాంగాన్ని హేళన చేసింది. దేశాన్ని పాలించడం జన్మహక్కు అని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ గెలవకుంటే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నేతి బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి, శక్తి లేదు. అధికార దాహంతో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కించపరిచిందని' పీఎం మోదీ స్పష్టం చేశారు.
"అయోధ్యలో రామమందిర నిర్మాణం 500 ఏళ్ల భారతీయుల స్వప్నం. అయోధ్యలో రామమందిరం నిర్మాణం మోదీ వల్ల కాదు, మీ ఓటు వల్లే సాధ్యం అయింది. ప్రభుత్వం పటిష్టంగా ఉంటే కొత్త చరిత్రను ఎలా సృష్టిస్తామో మీరు చూశారు. హైదరాబాద్‌లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్‌లో పండుగలపై ఆంక్షలు విధించారు. మీరు వేసే ఒక్కొక్క ఓటు మీ కలలు సాకారం కోసం వినియోగిస్తా." - మోదీ, ప్రధానమంత్రి
బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలలేదు- కాంగ్రెస్ మైండ్ పేలింది: మోదీ - PM Modi Attack On Congress
'EVMలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ'- 'ఇప్పటి వరకు 40 సార్లు ఇలా!' - SC EVMs Verdict