Political Parties Strategy on Votes in Lok Sabha Elections 2024 : ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే గంపగుత్తగా ఓట్లు తమ ఖాతాలో వేసుకునే వ్యూహాలకు నియోజకవర్గాల అభ్యర్థులు పదునుపెడుతున్నారు గ్రామాల్లోని మాజీ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామనే భరోసానిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో వ్యయం తాము భరిస్తామంటూ పలువురు పార్లమెంట్ అభ్యర్థులు స్థానిక నేతలకు మాట ఇస్తున్నారు.
పార్టీల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థులైతే ఒకడుగు ముందుకేసి, సీటు ఇప్పించి గెలిపించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పుడు మాత్రం గట్టెక్కించాలని అభ్యర్థులు కోరుతున్నట్లు తెలిసింది. దీంతో మండలాలు, పెద్ద గ్రామాల్లో గట్టి పట్టున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులకు డిమాండ్ పెరిగింది. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు స్థానిక నాయకులతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితమే సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ పట్టున్న వారిని కొన్ని చోట్ల దగ్గరికి తీస్తున్నారు.
Election Campaign in Telangana 2024 : మున్సిపాల్టీలు, నగరపాలికల్లో ప్రస్తుత కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు మాజీల నివాసాలకు వెళ్లి అభ్యర్థులు ఎన్నికల్లో సాయం కోరుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా రెండు మూడు శాసనసభ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున భేటీలు నిర్వహించి మద్దతు కూడగడుతున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా ప్రతినిధులను పిలిపించుకొని సమావేశాలు పెట్టి చర్చిస్తున్నారు. సొంతపార్టీ ప్రజాప్రతినిధులతో మంతనాలు పూర్తయ్యాక, ఇతర పార్టీలకు చెందిన స్థానిక నేతలతో మాట్లాడి, ఎన్నికల్లో సాయం కోరుతున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే స్థానిక ఎన్నికల్లో తోడుగా ఉంటామంటూ గ్రామాల్లోని నేతలకు అభ్యర్థులు భరోసానిస్తున్నారు. పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకుంటున్నారు.
ఉత్తర తెలంగాణకు చెందిన ఓ అభ్యర్థి రెండు రోజుల క్రితం రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున సమావేశాలు పెట్టి మద్దతు కూడగట్టారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు. కొందరిని హైదరాబాద్‌లోని తన ఇంటికి కూడా పిలిపించుకున్నారు. వారు ఆ అభ్యర్థి ముందు భారీ డిమాండ్లనే ఉంచినట్లు తెలిసింది. మరోసారి కలిసినప్పుడు చర్చిద్దామని, మీ కష్టం ఎక్కడికీ పోదంటూ వారికి గట్టి భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
ఉత్తర తెలంగాణలోనే మరో అభ్యర్థి ప్రతి రోజు ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులను నివాసానికి పిలిపించుకుని సమావేశం నిర్వహిస్తున్నారు. సొంతపార్టీ ప్రజాప్రతినిధులతో మంతనాలు పూర్తయ్యాక వారి ఫోన్ల నుంచి ఇతర పార్టీలకు చెందిన స్థానిక నేతలతో మాట్లాడించి మద్దతు కూడగడుతున్నట్లు తెలిసింది. వీలైతే తమ పార్టీలో చేరాలని లేదంటే బయటి నుంచి గుట్టుగా ఓట్లు పడేలా చూస్తే చాలని కోరి, తగిన హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ స్థానిక నేతలను పట్టించుకోని ఆయన ఇప్పుడు పిలిచి పెద్దపీట వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ఇప్పటికే తన పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పార్టీ మారినప్పటికీ, ఆ అభ్యర్థి మాత్రం కొందరితో వ్యక్తిగతంగా సమావేశం అవుతూ, సాయం కోరుతున్నారు. ఈ ఒక్కసారి సాయం చేస్తే రాజకీయ జీవితం నిలబడుతుందంటూ తన కష్టం చెప్పుకొంటున్నట్లు తెలిసింది. తనను కలిసినట్లు ఎక్కడా బయటపడకుండా చూసుకోవాలని, మీ తరఫున ఉండే ఓటు బ్యాంకును తనకు మళ్లించాలని కోరినట్లు చర్చ జరుగుతోంది.