Political Parties Speed up Lok Sabha Election Campaign : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తిరుమలగిరి పరిసర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కంటోన్మెంట్లో తనను, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి విజయయానికి వ్యూహం సిద్ధంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గుడ్డిబావి చౌరస్తా వద్ద భువనగిరి హస్తం పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి భారీ ర్యాలీ, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024 : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో హస్తం పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్‌కు మద్దతుగా మాదిగ, ఉప కులాల దండోరా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని రంగారెడ్డి గార్డెన్స్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌తో పాటు స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు.
Congress Election Campaign in Telangana : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పలు గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తరఫున మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం నిర్వహించారు. మానేరు వాగులో కూలిన వంతెనను సందర్శించారు. వంతెన కూలిపోయిన విషయంలో కేసీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. భారీ మెజార్టీ ఇచ్చి వంశీకృష్ణను పార్లమెంట్‌కు పంపించాలని ఆమె అన్నారు.
నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్‌లో ఆయనకు మద్దతుగా అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగరంలో ఇంటింటి ప్రచారం చేశారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి మద్దతుగా సినీనటి కుష్బూ ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ శివాజీ చౌక్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలదండ వేసి ప్రచారం మొదలుపెట్టారు.
BJP Election Campaign 2024 : మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు అవుతాయని కమలం పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరి డివిజన్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. శంషాబాద్‌లో జరిగిన బీజేపీ యువ మోర్చా యువ సమ్మేళనంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అవినీతి హస్తం పార్టీకి ఓట్లడిగే హక్కు, అర్హత లేదని విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులతో కిసాన్ సమ్మేళనం నిర్వహించగా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హాజరయ్యారు.
దేశ ప్రజలకు ప్రతిరోజు భద్రత కరవు : యాదాద్రి భువనగిరి జిల్లాలో పద్మశాలి సంఘం చేనేత కార్మికులతో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సమావేశం అయ్యారు. చేనేత కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతి రోజు బాంబుల మోతే వినిపిస్తుందని దేశ ప్రజలకు ప్రతిరోజు భద్రత కరవు అవుతుందని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి కొల్చారం గ్రామంలో కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్‌రావు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఖానాపురం హవేలి ప్రాంతాల్లో వినోద్‌రావు రోడ్ షో నిర్వహించారు.