Leaders Election Campaign in Telangana : పార్లమెంట్‌లో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతు అవసరమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి పద్మారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను బీజేపీకి ఓటు వేయాలని కోరారు. మెట్టుగూడ, అడ్డగుట్ట డివిజన్ల లో జీప్ యాత్ర నిర్వహించారు . దేశాన్ని అవినీతి, ఉగ్రవాద రహిత దేశంగా మార్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కిందని ఆయన అన్నారు.
Lok Sabha Elections 2024 : మల్కాజిగిరి లోక్‌సభ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కూకట్‌పల్లి కోర్టులో అడ్వకేట్లను కలిసి ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బార్ కౌన్సిల్ సభ్యులను, న్యాయవాదులను కలిసి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతులను వారికి గుర్తు చేశారు. సంపర్క్ సే సంవర్ధన్‌లో భాగంగా ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను బీజేపీ నేతలు కలిశారు. దేశం కోసం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి : నిజామాబాద్ నగరంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కమలం పార్టీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మోదీకి దిల్లీలోనూ, జిల్లాలోనూ ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి అని అన్నారు. దేశ ప్రజలకు మరోసారి మభ్య పెడుతున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని అర్వింద్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు భయపడుతున్నారు : 10 సంవత్సరాల భారత్ రాష్ట్ర సమితి పాలనలో భయపడని ప్రజలు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో భయపడుతున్నారని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాల్టీలో పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానని ఒకరు, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని మరొకరు హామీ ఇచ్చి మరిచారని వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోకుండా ఉండాలంటే గులాబీ పార్టీకి ఓటు వేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేశారు. ఖమ్మం లోక్‌సభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నియోజకవర్గంలోనిపలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థించారు.