PM Modi Speech in Nagarkurnool Public Meeting : రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు(BJP Vijaya Sankalpa Sabha) హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోదీ బహిరంగ సభ కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు. పదేళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని దుయ్యబట్టారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు అని ప్రధాని విమర్శించారు.
తెలంగాణలో మరింత కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తాం : అమిత్ షా
Modi Election Campaign in Telangana : రాష్ట్రంలో బీజేపీను గెలిపించాలని కోరిన ప్రధాని, ప్రజల ఆకాంక్షలను తాము నేరవేరుస్తామని అన్నారు. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధి కోసం తాను రాత్రి, పగలూ పనిచేస్తానని తెలిపారు. శుక్రవారం మల్కాజిగిరిలో జరిగిన రోడ్‌షోలో ప్రజలు వీధుల్లో బారులు తీరి కాషాయ పార్టీకి మద్దతు తెలిపారన్నారు. బీజేపీ ఎంపీలను(BJP MP Candidates) భారీ సంఖ్యలో గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్ ఆటలు సాగవని పేర్కొన్నారు. ఆ పార్టీ ‘గరీబీ హఠావో' అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చిందన్న ప్రధాని, కానీ పేదరికం పోయిందా అని ప్రశ్నించారు.
మార్పునకు గ్యారంటీ - మోదీ గ్యారంటీ : కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమేనని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. కమలం పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు మొదలైందని చెప్పుకొచ్చారు. మార్పునకు గ్యారంటీ, మోదీ గ్యారంటీ(Modi Guarantee) మాత్రమేనని ఉద్ఘాటించారు. తన కోసం ఏ ఒక్కరోజు కూడా వినియోగించుకోలేదన్న మోదీ, రేయింబవళ్లు 140 కోట్ల ప్రజల కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో కీలక నిర్ణయాలైన ఆర్టికల్ 370, అయోధ్య రామాలయం నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు అని మోదీ తెలిపారు.
"కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కలిసి తెలంగాణ ప్రజల కలల్ని, ఆకాంక్షల్ని చిదిమేశాయి. ప్రస్తుతం రాష్ట్రం కాంగ్రెస్ కబంద హస్తంల్లోకి వెళ్లింది. అప్పుడేమో గులాబీ పార్టీ భారీ దోపిడీ. ఇప్పుడే కాంగ్రెస్ వక్ర దృష్టి. కాంగ్రెస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి ఐదేళ్లు చాలా ఎక్కువ. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే, కాంగ్రెస్ వాళ్ల ఆటలు సాగడానికి చాలా కష్టమవుతుంది."-నరేంద్రమోదీ, ప్రధాని
తెలంగాణలో ప్రజల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచామన్న ప్రధాని, కోటిన్నర మందికి బీమా కల్పించినట్లు వెల్లడించారు. అదేవిధంగా 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించామన్నారు. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రైతులకే ఎక్కువ మేలు జరిగిందని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుతోందని విమర్శించారు.
గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును(President Draupadi Murmu) రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని, యాదాద్రిలో చిన్న పీట వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా అవమానించారని దుయ్యబట్టారు. కేసీఆర్ కూడా కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేడ్కర్‌ను అవమానించారన్న ప్రధాని, దళిత బంధు పేరిట కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు. దళితుడినే తెలంగాణ తొలి సీఎం చేస్తామని మోసం చేశారన్నారు.
PM Modi Jagtial Public Meeting Schedule : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీ రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఏపీలో బహిరంగ సభ ముగిసిన అనంతరం విజయవాడ నుంచి బేగంపేట విమానాశ్రయానికి రాత్రికి చేరుకోనున్నారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేసి, ఉదయం 11 గంటలకు జగిత్యాలకు చేరుకోనున్నారు. జగిత్యాలలో గంటపాటు నిర్వహంచే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. సభ అనంతరం జగిత్యాల నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణంకానున్నారు
టార్గెట్ సౌత్- 3రోజుల్లో 5 రాష్ట్రాల పర్యటన- దక్షిణాదిలో మోదీ దూకుడు