PM Modi Election Campaign in Andhra Pradesh : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు కేవలం మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీలు సైతం మేనిఫెస్టోలు కూడా విడుదల చేయడంతో ఆ హామీలను ఓటర్లకు వివరించడంతో దూసుకుపోతున్నారు. వీరికితోడుగా జాతీయ నేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే ఆ పార్టీ కీలక నేత నితిన్ గడ్కరీ నేడు రాష్ట్రానికి రానున్నారు. నేతల షెడ్యూల్ కూడా ఖరారు కావడంతో నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.
PM Modi Andhra Pradesh Tour : ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఆయన పాల్గొంటారు. రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్డీఏ అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని, రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
BJP Leaders Andhra Pradesh Tour : నేడు రాష్ట్రంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు విశాఖకు నితిన్ గడ్కరీ చేరుకుంటారు. అరకు పరిధి సుందరనారాయణపురం ఆయన వెళ్తారు. ఉదయం 11.30 గంటలకు, అనకాపల్లి పరిధిలో సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభలో నితిన్ గడ్కరీ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6.15 గంటలకు నాగ్‌పుర్ వెళ్లనున్నారు. అరకు, అనకాపల్లి బహిరంగ సభల్లో జేపీ నడ్డా పాల్గొననున్నారు.
ఏపీలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ - ఎక్కడంటే... - Prime Minister Modi