peddapalli congress Leaders On victory :పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించేందుకు స్థానిక నేతలు ఏకతాటిపైకి వచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారానికి తెరదించారు. విభేదాలను పక్కన పెట్టి పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతినబూనారు. నాయకుల మధ్య బేధాబిప్రాయాల సమసిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు కదనోత్సాహంతో క్షేత్రస్థాయిలో కదులుతున్నాయి.
Pedpadalli Congress Leaders Came Together : పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం టిక్కెట్ కోసం భారీ పోటీ నెలకొనగా కాంగ్రెస్ అధిష్ఠానం గడ్డం వంశీకృష్ణకు అవకాశం కల్పించింది. ఈ నియోజకవర్గ పరిధిలోనే వంశీకృష్ణ తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అభ్యర్థి ఎంపికపై మంత్రి శ్రీధర్‌బాబు మిగతా ఎమ్మెల్యేలకు అసంతృప్తి ఉందని అందుకే అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వంశీకృష్ణకు ఎమ్మెల్యేలు సహకరిస్తారా? అనే అనుమానాలు రేకెత్తాయి.
ఏకతాటిపైకి వచ్చిన పార్టీ నాయకులు
కుమారుడిని గెలిపించడం కోసం రంగంలోకి దిగిన వివేక్ పరిస్థితిని చక్కదిద్దారు. మంత్రి శ్రీధర్‌బాబు సహా ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి ఏకతాటిపైకి తెచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో సమావేశమైన నేతలు ఐక్యత చాటారు. తన తండ్రి వెంకటస్వామి సొంత నియోజకవర్గం కావడం, కుమారుడు వంశీకృష్ణను తొలి ఎన్నికల్లోనే గెలిపించాలనే తపనతో వివేక్ చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. వంశీకృష్ణ గెలపే లక్ష్యంగా తామంతా కలిసి పని చేస్తామంటూ పార్లమెంట్(Parliament) నియోజకవర్గ బాధ్యుడు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు మిగతా నేతలు ప్రకటించడం కాంగ్రెస్(Congress) శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ముఖ్య నాయకులంతా ఏకతాటిపైకి రావడంతో సమరోత్సాహంతో ప్రచారంపై దృష్టిపెట్టారు.
ఎన్నికల ప్రచారం షురూ!
మరోవైపు పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా(MP Candidate) కాకా మనవడు గడ్డం వంశీ కృష్ణను ఎంపిక చేయడంతో పార్లమెంట్ పరిధిలో ప్రచారం ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ సమావేశాలలో చురుకుగా పాల్గొంటున్నారు. తాను రాజకీయాలకు కొత్త కావచ్చేమో కానీ ప్రజాసేవకు(Public Service) కొత్త కాదని ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ చెబుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వారసత్వం పుణికి పుచ్చుకున్నానని పేర్కొన్నారు. అప్పట్లో కాకా చేసిన అభివృద్ధి ఇప్పడు తన గెలుపునకు(Victory) సాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.