Pawan Kalyani Pressmeet After Success : వైఎస్సార్సీపీ అవినీతి కోటలు బద్ధలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశామని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుని ప్రతీ రూపాయికి జవాబుతారీతనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకుందన్నారు. జనసేన తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు.
Nadendla Manohar On Result : ఏ నమ్మకంతో గెలిచామో వారి అంచనాలకు తగ్గట్లే పనిచేస్తామని తెనాలి నియోజవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాదెండ్ల మనోహర్ చెప్పారు. భవిష్యత్ లో ప్రజలకు ఏ విధింగా మంచి చేయాలనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. పవన్ కల్యాణ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పంతం నానాజీ చెప్పారు. వైఎస్సార్సీపీలో జగన్ తప్ప ఎవరూ ఉండరని అందరూ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారన్నారు. ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలు ఎగుమతి అవుతున్న బియ్యం రవాణపై దృష్టి సారిస్తున్నామన్నారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Nagababu Cangratulate Pawan Kalyan : ఈ విజయం అందరి సమష్టి కృషి అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఒక పార్టీ 100 శాతం విజయం దేశంలో ఎక్కడా వినలేదని అన్నారు. 21 మంది గెలుపు వెనుక 17 సంవత్సరాల అధ్యక్షుల శ్రమ దాగి ఉందని తెలిపారు. ఈ 17 ఏళ్లు ఆయన మానసికంగా, శారీరకంగా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి అందర్నీ విజయ పథంలోకి తీసుకువచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన వ్యక్తి అన్న నాగబాబు తమకు ఆయన నియోజకవర్గంలో పని చేసే అదృష్టం దక్కిందన్నారు. పిఠాపురంలో పని చేసిన 45 రోజులు ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. అక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు, వీర మహిళలు చూపిన ప్రేమ అద్భుతమని కొనియాడారు. ఈ ఎన్నికలు ఇద్దరే నడిపారు. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే, ఇంకొకరు సామాన్య ప్రజలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎర్ర కండువా మెడలో వేసుకుని పని చేశారన్నారు. ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, మనం బాధ్యతాయుతంగా పని చేస్తే 2029లో మరింత ప్రభావం చూపవచ్చని అన్నారు. హ్యాట్సాఫ్ టూ ప్రెసిడెంట్ హ్యాట్సాఫ్ జన సైనికులు అని నాగబాబు కొనియాడారు.
ఏపీలో ఎదురులేని కూటమి - విశ్వరూపం చూపించిన చంద్రబాబు - super hit combo
జనసేన జయకేతనం ఎగరవేసింది. తెలుగుదేశం, భాజపాతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 21 చోట్లా గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నట్లుగానే వంద శాతం స్ట్రైక్‌రేట్ సాధించింది. అధికార వైఎస్సార్సీపీలో సాధించిన సీట్ల కంటే రెట్టింపు సీట్లు గెలిచింది. జగన్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 11 స్థానాలకే పరిమితమైతే 21 సీట్లలో పోటీ చేసిన జనసేన అన్నింట్లోనూ గెలిచి, సత్తా చాటింది. శాసనసభలో తెలుగుదేశం తర్వాత అత్యధిక స్థానాలున్న రెండో పార్టీగా అవతరించింది. ఈ విజయంతో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ ‘పవర్’స్టార్‌గా నిలిచారు. ఈ ఎన్నికల్లో సాధించిన సీట్లతో జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించబోతుండటం ఆ పార్టీకి మరో మధురానుభూతిని మిగల్చనుంది. మొదటి నుంచి సత్తా చూపిస్తున్న ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లోనే కాకుండా ఉత్తరాంధ్ర, కృష్ణా గుంటూరు, రాయలసీమ జిల్లాల్లోనూ విజయం జనసేనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచిన జనసేనాని పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్నారు. తొలి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం తెనాలి నుంచి గెలుపొందారు.