Pawan Kalyan Speech at Alliance Public Meeting in Rajamahendravaram: దేశం మొత్తం అమృత ఘడియలు ఉంటే ఏపీలో మాత్రం విష ఘడియలు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena chief Pawan Kalyan) ఆక్షేపించారు. జగన్ పాలనలో అడుగడుగునా కుంభకోణాలేనని ధ్వజమెత్తారు. విష ఘడియల నుంచి అమృత ఘడియలకు తీసుకెళ్లాలని మోదీని కోరామని అందుకు ఆయన సహకరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలోని వేమగిరిలో కూటమి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న పవన్ వైసీపీ అవినీతి కోటలను బద్ధలు కొడతామని హెచ్చరించారు.
చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో నెంబర్ వన్- జగన్ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం: మోదీ - PM MODI speech
కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్, జగన్ పేర్లు పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. అలానే కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల మంది యువత ఉన్నారని వారికి ఈ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించ లేదని మండిపడ్డారు. అణువణువునా దేశభక్తి నింపుకున్న సమాజం మనదని అంతే కాకుండా దేశానికి జాతీయజెండా అందించిన నేల మనదని అన్నారు. జగన్ పాలనలో అడుగడుగునా కుంభకోణాలే ఉన్నాయని అన్నారు. మోదీ వికసిత్ భారత్ కలలో మేమూ భాగస్వాములం అవుతామని తెలిపారు. గతంలో పద్మ అవార్డులు రాజకీయాలు చేసేవారికే వచ్చేవని మోదీ హయాంలో అసలైన అర్హులకు ఈ అవార్డులు దక్కుతున్నాయని పవన్ తెలిపారు. అసలైన కళాకారులను గుర్తించి మోదీ గుర్తించి సత్కరించారని పవన్ కల్యాణ్ అన్నారు.
అయోధ్యకు శ్రీరాముడిని తీసుకువచ్చిన మహానుభావుడు మోదీ అని పవన్ కల్యాణ్ కొనియాడారు. భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి మోదీ అని అన్నారు. దేశానికి అభివృద్ధితోపాటు గుండెధైర్యం అవసరమని తెలిపారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకునే గుండె ధైర్యం కావాలని అన్నారు. పదేళ్లుగా భారత్ వైపు చూడాలంటేనే శత్రువులు భయపడుతున్నారని అదంతా కేవలం ఒక్క మోదీ వల్లనే అని అన్నారు. మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందిస్తోందని తెలిపారు. కేంద్ర పథకాలను వైసీపీ తన పథకాలుగా చెప్పుకుంటోందని విరర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జగన్ అందిపుచ్చుకోలేకపోయారని పవన్ కల్యాణ్ అన్నారు.