Adilabad MP Election 2024 : రాష్ట్రంలోని రెండు ఎంపీ ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో ఒకటి ఆదిలాబాద్ నియోజకవర్గమైతే మరోకటి మహాబూబాబాద్. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఆదివాసీ ఉద్యమ నేత సోయం బాపురావు అనూహ్యా విజయం సాధించారు. ఈ సీటును మళ్లీ కైవసం చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ సిటింగ్ ఎంపీ సోయం బాపురావుకు కాకుండా, బీఆర్ఎస్ నుంచి వచ్చిన గోడం నగేష్‌కు టికెట్ ఇచ్చింది. పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకొన్న 42 మంది అభ్యర్థులను పక్కన పెట్టినప్పటికీ, మోదీ చరిష్మా, హిందూత్వ నినాదం, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేల విజయం, ఈ ఎన్నికల్లో కలిసి వస్తాయనే ధీమా కమలం పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
Lok Sabha Elections 2024 : కాంగ్రెస్ టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకుంటే పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో మానవ హక్కుల వేదిక నాయకురాలైన ఆత్రం సుగుణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. చట్టసభల రాజకీయాలకు కొత్తైన ఆమెను బరిలో నిలపటం ద్వారా మహిళా ఓటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం హస్తం పార్టీ విజయానికి దోహదం చేస్తాయనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్ వచ్చి సుగుణ తరపున ప్రచారం చేసి అంకితభావంతో పనిచేసేవారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం : శాసనసభ ఎన్నికల వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగులేని రాజకీయశక్తిగా ఉన్న భారత్ రాష్ట్ర సమితి ముందుగా ప్రకటించినట్లుగా ఎంపీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కునే బరిలోదింపింది. స్వతహాగా క్షేత్రస్థాయి రాజకీయాలను ప్రభావితం చేయటంలో అనుభవజ్ఞుడైన సక్కు, అంతర్గతంగా ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించటం లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తుందనే ఆశ గులాబీ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
ఆసక్తికరంగా ఆదిలాబాద్ రాజకీయం : ఈ ఎన్నికల్లో గిరిజనులు సహా గిరిజనేతరుల ఓట్లు కూడా పాత్ర కీలకంగా మారుతోంది. దాదాపుగా 16 లక్షల పైచిలుకు ఓటర్లలో నాలుగున్నర లక్షల ఆదివాసీ, గిరిజన ఓటర్లను మినహాయిస్తే మిగిలినవన్నీ గిరిజనేత ఓట్లే. బీజేపీ గాలి నిజంగానే ఉందా? కాంగ్రెస్ పథకాలపై ప్రజలు మొగ్గుచూపుతున్నారా? బీఆర్ఎస్ అభ్యర్థికి మద్ధతు ఇస్తారా? అనేది ఆదిలాబాద్ రాజకీయాన్ని ఆసక్తికరమైన మలుపులు తిప్పుతోంది.