Padi Kaushik Reddy Vs Arekapudi : రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించిన అనంతరం పరిణామాలు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించాయి. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి, గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్‌తో మొదలైన పంచాయితీ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది.
గాంధీని పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో గాంధీ వెంట వచ్చిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే గాంధీ, ఆయన అనుచరులపై సుమోటోగా కేసులు నమోదు చేసిన పోలీసులు, సొంత పూచీకత్తుతో గాంధీని విడుదల చేశారు.
కమిషనరేట్ ముందు బైఠాయింపు : హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తాము ఆందోళన చేస్తుంటే, గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హత్యాయత్నం కేసుతో పాటు అదనపు డీసీపీ, ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలంటూ కమిషనరేట్ ముందు బైఠాయించారు. ఎఫ్ఐఆర్ ప్రతిని నేతలకు ఇచ్చిన పోలీసులు, వారికి నచ్చజెప్పే యత్నం చేశారు. అయినా వినకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.
తర్వాత వారిని పోలీసులు మూడు వాహనాల్లో వేర్వేరుగా తీసుకెళ్లారు. ఒక వాహనంలోని నేతలను కొండపల్లి పోలీస్ స్టేషన్‌కు, మరో వాహనంలోని నేతలను కేశంపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనాలను పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కొత్తపేట వద్ద రోడ్డుపై టైర్లు కాల్చి వేశారు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వారిని చెదరగొట్టాల్సి వచ్చింది.
భారీగా చేసిన బీఆర్ఎస్ నేతలు : హరీశ్‌రావు సహా ఇతర నేతలను తీసుకెళ్లిన కేశంపేట పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తగా, రాత్రి 11 గంటల తర్వాత నేతలను పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి నివాసంతో పాటు సిద్దిపేట, ఖమ్మం ఘటనల్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న డీజీపీ హామీ మేరకు స్టేషన్ నుంచి వెళ్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
కౌశిక్ రెడ్డిపై కేసు : మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ రవి చందన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత కౌశిక్ రెడ్డి, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, గచ్చిబౌలి డీసీపీ కార్యాలయానికి వెళ్లి గాంధీ సహా ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే గాంధీ తనపై దాడికి వచ్చారన్న కౌశిక్ రెడ్డి, శాసన సభ్యులకే పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు.
నేడు అరెకపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు బయల్దేరతారని, పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొంటారని పేర్కొంది.