Narasaraopet constituency : నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి (Narasaraopet Lok Sabha constituency) 1952లో తొలిసారి ఎన్నిక జరిగింది. ఇది జనరల్ కేటగిరి. నియోజకవర్గ పునర్విభజనకు ముందు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కంభం, గుంటూరు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉండేవి. పునర్విభజన తర్వాత గుంటూరు జిల్లాకే పరిమితమైంది.
పల్నాడు, డెల్టా ప్రాంతాలకు నరసరావుపేట కేంద్రంగా ఉంది. నర్సరావు పేటను 'పల్నాడు గేట్‌వే' అని కూడా పిలుస్తుంటారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ (జవహర్ కెనాల్) ద్వారా పంటలకు సాగు నీరు ప్రధాన వనరు. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే కోటప్పకొండ కొండ జాతర రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుంది. ఆ రోజున నిర్వహించే ప్రభ బండుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పట్టణంలోని భీమ లింగేశ్వర స్వామి ఆలయం, పాతూరు శివాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- నరసరావుపేట
- చిలకలూరిపేట
- సత్తెనపల్లి
- పెదకూరపాడు
- గురజాల
- మాచర్ల
- వినుకొండ
నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు
- మొత్తం ఓటర్ల సంఖ్య 17,14,127
- పురుషులు 8,38,451
- మహిళలు 8,75,480
- ట్రాన్స్‌జెండర్లు 196
ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధికసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. మూడుసార్లు తెలుగుదేశం, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నుంచి అనిల్‌కుమార్ యాదవ్ పోటీ చేస్తుండగా, టీడీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ బరిలో నిలిచారు.
ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీరే!
1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి సి.ఆర్.చౌదరి విజయం సాధించారు. అనంతరం 1967లో జరిగిన ఎన్నికల్లో మద్ది సుదర్శనం(కాంగ్రెస్), 1971: మద్ది సుదర్శనం(కాంగ్రెస్), 1977: కాసు బ్రహ్మానందరెడ్డి(కాంగ్రెస్), 1980: కాసు బ్రహ్మానందరెడ్డి(కాంగ్రెస్), 1984: కాటూరి నారాయణ స్వామి(తెలుగుదేశం) విజయం సాధించారు.
గత ఎన్నికల్లో విజేతలు - సమీప ప్రత్యర్థులు
- 1989: కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్) - పిడతల రంగారెడ్డి (టీడీపీ)
- 1991: కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్) - అనిశెట్టి పద్మావతి (టీడీపీ)
- 1996: కోట సైదయ్య(తెలుగుదేశం) - కాసు వెంకట కృష్ణారెడ్డి (కాంగ్రెస్)
- 1998: కొణిజేటి రోశయ్య(కాంగ్రెస్) - కోట సైదయ్య (టీడీపీ)
- 1999: నేదురుమల్లి జనార్ధనరెడ్డి(కాంగ్రెస్) - ఎస్.ఎం. లాల్‌జాన్ పాషా (టీడీపీ)
- 2004: మేకపాటి రాజమోహన రెడ్డి(కాంగ్రెస్) - మద్ది లక్ష్మయ్య (టీడీపీ)
- 2009: మోదుగుల వేణుగోపాలరెడ్డి(తెలుగుదేశం) - వల్లభనేని బాలశౌరి (కాంగ్రెస్)
- 2014: రాయపాటి సాంబశివరావు(తెలుగుదేశం) - ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (వైఎస్సార్సీపీ)
- 2019: లావు శ్రీకృష్ణదేవరాయలు (వైఎస్సార్సీపీ) - రాయపాటి సాంబశివరావు (టీడీపీ)