Money and Liquor Distribution Start in Lok Sabha Polls : లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్. ఇప్పుడు ఆఖరి ఘట్టంగా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెర లేపుతాయి. ముఖ్యంగా రాజధాని పరిధిలో ఈ పంపకాలు ఎక్కువ. సాయంత్రం 6 గంటలతో ప్రచారం గడువు ముగియనుండటంతో డబ్బులు, ఇతరత్రా పంపకాలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే నమ్మకమైన నేతల ఇళ్లకు కరెన్సీ చేరగా, వాటిని శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు ఓటర్లకు పంపిణీ చేసేలా ప్రధాన పార్టీల్లోని కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు మద్యం సరఫరాకు ఇప్పటికే ఆ నిల్వలను మండల కేంద్రాలకు తరలించారు.
- సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలో అధికంగా నోట్ల పంపిణీ జరిగేందుకు అవకాశం ఉందనే విషయం తెలుస్తోంది.
- కూకట్పల్లి, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధుల్లో శనివారం రాత్రి ఒక దఫా, ఆదివారం రాత్రి మరోసారి మద్యం, నగదు పంపిణీకి నాయకులు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.
- మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతలు డబ్బు, మద్యాన్ని సిద్ధం చేశారు. ఇందుకోసం నమ్మకస్తులకు రూ.కోట్ల నగదు అప్పజెప్పారు. నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేస్తుండటంతో ఇప్పటికే మద్యం స్టాక్‌ను తెలిసిన వారి ఇళ్లలో ఉంచుతున్నట్లు సమాచారం. నగదు, మద్యం పంపిణీకి అసెంబ్లీ సెగ్మెంట్లలో బస్తీలు, కాలనీలు, పారిశ్రామికవాడలు ఉండటంతో 10-15 కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. బూత్ స్థాయిలోని నాయకులు ఓటర్లకు కాగితంపై ఒక కోడ్ రాసిస్తున్నారు. ఆ కోడ్‌ను చూపించి నగదు, మద్యం తీసుకోవాలని సూచిస్తున్నారు.
- చేవెళ్ల, వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో డబ్బు పంపిణీ తారాస్థాయికి చేరుకుంది. ఓ జాతీయ పార్టీ ఓటుకు రూ.500లు ఇస్తున్నారని తెలుసుకుని, మరో జాతీయ పార్టీ రూ.1000తో పాటు మద్యం సీసాను కూడా ఇస్తామంటూ ముమ్మర ప్రచారం చేసింది. అందుకు ఆదివారం రాత్రి పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంది.
- రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని పారిశ్రామిక వాడల్లో పని చేస్తున్న కార్మికులకు ఆదివారం మధ్యాహ్నం ఎంపిక చేసిన ప్రాంతాల్లో వారికి మద్యం, విందు భోజనం ఏర్పాటు చేశారు.
- ముఖ్యంగా చేవెళ్ల లోక్‌సభ పరిధిలో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగింది. అలాగే రెండు ప్రధాన పార్టీల నాయకులు మద్యం, నగదు పంపిణీలోనూ పోటాపోటీగా పోటీపడుతున్నారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బస్తీలపై దృష్టి కేంద్రీకరించారు. మద్యం నిల్వలను నేతల బంధువుల ఇళ్లలో, హోటళ్లలలో దాచిపెడుతున్నారు.
సొంతవారికే పంపకాల అప్పగింతలు : ఇదే సమయంలో అభ్యర్థులకు పంపకాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ బాధ్యతలు తమకే అప్పజెప్పాలంటూ డివిజన్, బూత్‌స్థాయి నాయకులు ఉదయాన్నే నేతల ఇంటి వద్ద తిష్ఠ వేస్తున్నారు. బూత్‌స్థాయి నేతలకు అప్పగించాలని కొందరు, డివిజన్ స్థాయి నేతలకు అప్పగించాలని మరికొంత మంది కోరుతున్నారు. సామాజికవర్గాల వారీగా ఓట్లేయిస్తామని, చివరి రోజు ర్యాలీలకు జనాలను తీసుకొస్తామని ఇంకొందరు నేతల వద్దకు వస్తుండటంతో ఏం చేయాలో అభ్యర్థులకు అర్థం కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కొన్ని నెలలకే పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఖర్చు భారీగా అవుతున్నాయంటూ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. కింది స్థాయి నాయకుల బాధలను తట్టుకోలేక అభ్యర్థులు ఇంట్లో ఉన్నా లేమనో, లేక ప్రచారం పేరుతో బయటకు వెళ్లిపోవడమో చేస్తున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల తంటాలు - పోటాపోటీగా డబ్బు పంపిణీ చేస్తున్న అభ్యర్థులు