Kaushik Reddy Vs Arekapudi Controversy Update : హైదరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య మాటల వేడి చల్లారలేదు. ఎమ్మెల్యే గాంధీ నివాసంలో మేడ్చల్ జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నకౌశిక్‌రెడ్డి ప్రకటన రెండోరోజు కాక రేపింది. గురువారం రాత్రే శంబీపూర్ రాజు ఇంటికి చేరుకుని ఉదయం అక్కడ నుంచి బయలుదేరదాం అనుకున్న కౌశిక్‌రెడ్డితో పాటు శంబీపూర్ రాజును పోలీసులు ఉదయమే గృహనిర్బంధం చేశారు.
రాజు నివాసం వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాకుండా నిలువరించారు. గృహ నిర్బంధం చేయటంపై కౌశిక్‌రెడ్డి, శంబీపూర్ రాజు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ పార్టీలోనే ఉన్నారని చెబుతున్న గాంధీ నివాసానికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దానం నాగేందర్ విషయంలో ఒక నీతి, తమకు ఒక నీతి ఉంటుందా అని మండిపడ్డారు.
ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం : అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతోనే అరెకెపూడి గాంధీ తన ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారని ఆరోపించారు. వివాదం ఇద్దరి వ్యక్తిగతమని గాంధీ స్వయంగా చెప్పారని, సెటిలర్లు పదాన్ని తాను ఎక్కడ వాడలేదన్నారు. ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడి ఉంటే అది గాంధీకి సంబంధించి మాత్రమే అని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, కొత్తా ప్రభాకర్‌రెడ్డి బయటకు రాకుండా పోలీసులు నిలువరించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తన భుజానికైన గాయానికి చికిత్స తీసుకునేందుకు పోలీసుల అనుమతితో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.
సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఆందోళనలో పాల్గొని గాయపడిన హరీశ్‌రావును పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. జిల్లాల్లోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. పలుచోట్ల గులాబీ శ్రేణులు నిరసనలు చేపట్టారు.