MLA Yennam Srinivas Reddy Counter to KTR on Phone Tapping Issue : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు లీగల్ నోటీసులు పంపి కేటీఆర్ బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ తనతో పాటు మరో ఇద్దరికీ లీగల్ నోటీసులు పంపారని అన్నారు. అసలు ఆయనకు లాపై, అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case)పై వరుస కథనాలు వస్తున్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. దానిపై తాము కూడా తమ ఫోన్ ట్యాప్ అయినట్లు డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజంపై కేటీఆర్‌కు ఏం తెలుసు, బ్లాక్ మెయిల్ బెదిరింపులు తప్ప అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తనకు లీగల్ నోటీసులు(KTR Legal Notice) ఇవ్వడానికి ఆస్కారం ఏముందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ జరుగుతున్నప్పుడు లీగల్ నోటీసులు ఇస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్‌లో ఒకరు, గెస్ట్ హౌస్‌లో ఇంకొకరు ఉండి పాలన సాగించారని, గత పదేళ్ల పాలనపై విమర్శలు చేశారు. అడ్డిమారి గుడ్డి దెబ్బల పాలన సాగినట్లుందని ఎద్దేవా చేశారు.
హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి - ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్!
Phone Tapping Case in Telangana : పోలీసు ఆఫీసర్లను జైల్లో ఎందుకు పెడతారు ఆధారాలు ఉంటేనే కదా అంటూ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ ప్లేస్‌లో తాను ఉంటే డీజీపీకి లేఖరాసే వాడిని, నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడినని అన్నారు. లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బులను తరలించినట్లు వార్తలు కూడా వచ్చాయని గుర్తు చేశారు. మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్‌కు ఏం తెలుసునని దుయ్యబట్టారు.
హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కథనాలు : అధికార దుర్వినియోగం చేసినందుకు 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చెయ్యాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అసలు లీగల్ నోటీసులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేటీఆర్‌కు ఇవ్వాలని ఎందుకంటే దిల్లీకి కప్పం కడుతున్నారని అనే ఆరోపణలు చేసినందుకు అని హెచ్చరించారు. ఇతర పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడమే కాదు సొంత ఇంటి వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయలేదా అంటూ ప్రశ్నించారు. దీనికి కూడా నోటీసులు ఇస్తే ఇచ్చేయ్ అంటూ హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సమాజ వ్యతిరేక శక్తులపై చేస్తారని కానీ వ్యక్తుల ఫోన్లపై కాదన్నారు. హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కథనాలు వస్తున్నాయని వాటి సంగతి ఏంటని కేటీఆర్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అడిగారు.
టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే చర్యలు తప్పవు - ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు