MLA Palla on Untimely Rains : అకాల వర్షాలు, వడగండ్లతో రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కనీసం రైతులను పరామర్శించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పైగా గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. భారత రాష్ట్ర సమితి హయాంలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగితే, బోనకల్లు వెళ్లి పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులకు కొత్త జీవో తీసుకొచ్చి ఎకరాకు రూ.10 వేలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
దెబ్బతిన్న పంటను కొనుగోలు చేయాలి : పంట నష్టపోయిన రైతులకు కేసీఆర్ నిధులు విడుదల చేస్తే, కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని పల్లా ఆరోపించారు. చిత్తశుద్ది ఉంటే వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రూ.7,500 కోట్లు సిద్ధం చేస్తే, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుల ఖాతాల్లో పడకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులు ఎవరు వాడుకున్నారో తెలుసని, వాళ్లు రాష్ట్ర మంత్రివర్గంలోనే ఉన్నారని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇంతవరకు అందరికీ రైతుబంధు పడలేదని, రూ.16,500 కోట్ల అప్పు తెచ్చిన డబ్బులు, ఎక్కడకి పోయాయని పల్లా ప్రశ్నించారు. రైతులను ముంచకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేయాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Palla Rajeshwar Reddy On CM KCR : కేసీఆర్ తెలంగాణ గాంధీ.. ఎమ్మెల్సీ పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని పల్లా ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎండాకాలంలోనూ సాగు నీరు ఇచ్చామన్న ఆయన, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎందుకు సాగు నీరు, తాగు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలోకీ వెళ్లడం శోచనీయమన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్లో గెలిచి ఇతర పార్టీలకు వెళ్తున్న నేతలను ప్రజలే ఛీ కొడతారని, చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. అక్రమాలు చేయడానికే అధికార పార్టీలోకి వెళ్తున్నారని ఆరోపించారు. వారి అక్రమాలను తమ పార్టీ బయట పెడుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు రూ.10 వేలు ఇచ్చాం. పంట నష్టపోయిన రైతులను సీఎం, మంత్రులు పరామర్శించాలి. స్వార్థపరులు పార్టీ మారుతున్నారు. అక్రమాన్ని సక్రమం చేసుకోవడానికే పార్టీ మారుతున్నారు. ప్రజలే వారిని ఛీ కొడతారు. - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
'ఆదిలాబాద్ వేదికగా మోదీ, రేవంత్‌ల బడే భాయ్, చోటా భాయ్ బంధం బహిర్గతమైంది'