MLA Palla Rajeshwar Reddy On Dharani Portal : ధరణి ద్వారా తెచ్చిన భూసంస్కరణలు రైతులకు మేలు చేకూర్చాయని, దేశంలో కేసీఆర్‌లా ఏ ముఖ్యమంత్రి కూడా ధరణి వంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. భూమి హక్కులు, సంస్కరణల అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాలం నుంచి అనేక రెవెన్యూ సంస్కరణలు వచ్చాయని, అనేక రాష్ట్రాలు భూసర్వే చట్టాలు చేశాయని తెలిపారు. ఆనాటి సీఎం కేసీఆర్ అందరితో చర్చించే ధరణి తీసుకొచ్చారని, కేసీఆర్ నాలుగు గోడల మధ్య ధరణిపై నిర్ణయం తీసుకోలేదని పల్లా స్పష్టం చేశారు. ధరణి పేరు బాగాలేదని భూమాత అని పెడతామంటున్నారని, ధరణి అంటే భూమాతనే అని పేర్కొన్నారు. ధరణి అనగానే కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ గుర్తొస్తున్నారని వ్యాఖ్యానించారు.
"మా హయాంలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి. సీలింగ్ చట్టం ప్రకారం 25 నుంచి 52 ఎకరాల వరకే ఉండాలి. ధరణి చట్టం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయి. రైతులకు బయోమెట్రిక్ ద్వారా భూహక్కులు కల్పించాం. ధరణి ద్వారా తెచ్చిన భూసంస్కరణలు రైతులకు మేలు చేకూర్చాయి. డిజిటల్ సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలు ఇవ్వాలని కోరుతున్నాం." - పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ధరణి బాగాలేకపోతే దాన్నే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కొత్త సీఎం కేవలం ధరణి పేరు మాత్రమే మారుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయని చెప్పారు. ధరణి చట్టం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయని, బయోమెట్రిక్ విధానంతో భూ లావాదేవీలు జరిగేలా ధరణి అమలు చేసినట్లు తెలిపారు.
రైతులు ధరణి అంటే భయ పడుతున్నారు : ధరణి తప్పులతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న మంత్రి సీతక్క పోర్టల్‌లోని తప్పులతో అధికారుల మీద దాడులు జరిగిన ఘటనలు చూశామని అన్నారు. ధరణి అంటేనే రైతులు భయపడే పరిస్థితి వచ్చిందన్న మంత్రి ధరణిని ఎప్పుడు మారుస్తారని రైతులు అడుగుతున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ అంటేనే భూపంపిణీకి ఆద్యురాలు అన్న సీతక్క ఏడుసార్లు పంచిన ఘనత ఇందిరమ్మదని వివరించారు. ధరణి వచ్చాక అసైన్డ్ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కొందని ధరణి వచ్చాక భూమి మళ్లీ కొంతమంది దగ్గరికే వచ్చిందని సీతక్క అన్నారు.
రాష్ట్రానికి లబ్ధి కలిగించే విషయాల్లో అందరం కలిసి పనిచేద్దాం: కేటీఆర్ - KTR SPEECH IN ASSEMBLY TODAY