MLA Maheshwar Reddy Slams Congress Govt : రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిండా ముంచిందని బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక మాఫీ చేయకపోవడంతో బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
పూర్తి స్థాయి ఎండాకాలం రాక ముందే ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిందని, పంటలకు నీరు ఎలా ఇవ్వాలో ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని దుయ్యబట్టారు. పంట నష్టానికి తక్షణమే రూ.10 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు తప్పితే, ఇప్పటి వరకు ఒక్క రూపాయీ ఇవ్వలేదని ఏలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో గత ప్రభుత్వాన్ని రూ.20 వేల పరిహారం డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు రూ.20 వేలు ఇవ్వడం లేదని నిలదీశారు.
'ధరణి' పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం - కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : ఏలేటి
మొన్నటి వరకు ప్రధాని మోదీని బడే భాయ్ అన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు నరేంద్ర మోదీ అంటే మోసం అంటున్నారని ఏలేటి దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే తుక్కుగూడ జన జాతర సభపైనా మహేశ్వర్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీతో గ్యారంటీలు ప్రకటింపజేసి, ముఖ్యమంత్రి తన చేతికి మట్టి అంటకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. అబద్ధాలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లు, దేశంలోనూ అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకూ చేయలేదు. రుణాలపై బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయి. పంటలు ఎండిపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలి. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని గతంలో రేవంత్ కేసీఆర్ ప్రభుత్వాన్ని అడిగారు. ఇప్పుడు సీఎం అయ్యాక అంతే మొత్తం పరిహారం ఎందుకు ఇవ్వట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి గెలిచింది. కేంద్రంలోనూ అబద్ధాలతో అధికారంలోకి రావాలని చూస్తుంది. - ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే
రాష్ట్రంలో మరో రెండు, మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి