Attack on Election Campaign Vehicle : దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయడమే నేరం అన్నట్టుగా అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. రెండు రోజుల క్రితం దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో పాల్గొన్నారని గ్రామస్తులపై దాడి చేసిన ఘటన మరిచిపోకముందే మరోసారి వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. దెందులూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎంఎల్ఏ అబ్బయ్య చౌదరి అనుచరులు కాంగ్రెస్ ప్రచార రథంపై విరుచుకుపడ్డారు. జెండాలు పీకేసి అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్నవారు మహిళలు అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని కిందికి లాగి భౌతిక దాడులకు తెగబడ్డారు. ఎమ్మెల్యే కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా కనీసం వారించలేదని మహిళలు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ మూక దాడిలో గాయపడిన మహిళలు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో దాడి జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చెలరేగిపోయారు. సదూం మండలం యర్రాతివారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న BCYP పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ పై దాడికి యత్నించారు. మంత్రి స్వగ్రామంలోనే ఓట్లు అడిగే ధైర్యం ఉందా అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు వేణుగోపాల్‌రెడ్డి వారితో ఘర్షణకు దిగారు. కార్లు, ప్రచార రథంపై రాళ్లతో విరుచుకుపడగా అక్కడ ప్రచారం ముగించుకుని గొడ్లవారిపల్లెకు వెళ్లిన రామచంద్రయాదవ్‌పై మరోసారి పేట్రేగిపోయాయి. పార్టీ ప్రచార వాహనాలను ధ్వంసం చేసి ఎల్సీడీ తెరలను పగులగొట్టారు.
టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు- 'టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారని ఇల్లు ఖాళీ చేయించారు'
'Y' ప్లస్ భద్రత కలిగి ఉన్న రామచంద్రయాదవ్‌ను సురక్షితంగా సదూం పోలీసుస్టేషన్‌కు తరలించగా అక్కడ కూడా వైఎస్సార్సీపీ మూకలు దాడికి యత్నించాయి. స్టేషన్ ఎదుటే దాడి జరుగుతున్నా, స్టేషన్ ఆవరణ లోపలకు చొచ్చుకొచ్చి దుర్భాషలాడుతున్నా పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణం. స్టేషన్ ఎదుటే BCYP ప్రచార రథం ధ్వంసం చేసి నిప్పుపెట్టినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.
దాదాపు 200 మందికిపైగా అధికార పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లోపల ఉన్న రామచంద్రయాదవ్‌పై దాడికి యత్నించారు. మరోవైపు బయట ఉన్న ప్రచార రథం జనరేటర్‌కు వైఎస్సార్సీపీ కార్యకర్తలు మంటపెట్టగా పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంటలు అదుపు చేశారు. ఇంతా జరుగుతున్న ఆందోళనకారులను వెనక్కిపంపేందుకు పోలీసులు కనీస ప్రయత్నం చేయలేదు. ఈ దారుణాలను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లు అధికార పార్టీ కార్యకర్తలు గుంజుకొని వీడియోలు డిలీట్ చేయించి చితకబాదారు. ఎస్పీ మణికంఠ అక్కడకు రావడంతో పరిస్థితులు సద్దమణిగాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రచారానికి వెళ్తే సమస్య తలెత్తుతుందంటూ ఉచిత సలహా ఇవ్వడంపై రామచంద్రయాదవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి ఓటు అడిగే హక్కు ఉందని, పోలీసులు మంత్రికి సహకరించడం సరికాదన్నారు.
టీడీపీ ప్రచార రథంపై వైఎస్సార్సీపీ నాయకులు రాళ్ల దాడి - ఓ బాలుడికి గాయం - YSRCP Leaders mob attack