'
Shridhar Babu Comments On Six Guarantees : ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబ స్పష్టం చేశారు. వచ్చే శాసనసభా సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు మాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
డీఎస్పీ ఇప్పటికే రెండు,మూడు సార్లు వాయిదా పడిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మళ్లీ వాయిదా వేస్తే ఇప్పటికే చదువుకుంటున్న వారికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో యువత పడొద్దని విజ్ఞప్తి చేశారు. రేపు 31వేల కోట్ల పై చిలుకు రైతులకు రుణమాఫీ చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించారు. నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో గత యూపీఏ ప్రభుత్వం కేజీబీవీలను ప్రారంభించిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.
విద్య, వైద్య రంగాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని శ్రీధర్ బాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఒక ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. చెరుకూరుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమను తీసుకొస్తామన్నారు. వనపర్తిలో ఐటీ పార్క్‌ను, సర్వారెడ్డి పల్లెలో రూ.800 కోట్లతో యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే కావాల్సింది విద్య అని చదువుకుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అనేక పోటీ పరీక్షలు తట్టుకుని వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయులను, ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నామన్నారు. ధనిక రాష్ట్రం అయిన గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చింది అన్నారు. అప్పులను, వడ్డీలను చెల్లించుకుంటూ ఆరు గ్యారంటీ హామీలను అమలు చేస్తున్నామన్నారు. పంద్రాగస్టు లోపల రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని ఆరడుగుల వ్యక్తి అన్నారు. ఇప్పుడు చేస్తున్నాం మరి ఆయన ఏం చేస్తారో చూడాలి అని చమత్కరించారు. అందరూ ఆరోగ్యం, చదువుపట్ల శ్రద్దపెట్టాలని మంత్రి సూచించారు.