Minister Ponnam Prabhakar Fires on Bandi Sanjay : పది సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో పలువురు బీఆర్ఎస్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం, బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. నాలుగు నెలల తమ పాలనలో ఆరు గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేసిందా అని నిలదీశారు. ఎంత మంది ఖాతాల్లో రూ.15 లక్షలు వేసిందని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్లో తాము పోటీ నుంచి తప్పుకుంటామని పొన్నం సవాల్ విసిరారు. లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న బండి సంజయ్ తప్పుకుంటారా అని అడిగారు. అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేసిన బండి సంజయ్ ఎంపీగా కొనసాగడానికి వీల్లేదనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని అన్నారు.
దేశంలో ఆస్తులన్నీ తీసుకెళ్లీ అంబానీ, అదానీ చేతుల్లో పెట్టారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందని నిలదీశారు. ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి కరీంనగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని బండి సంజయ్‌పై పొన్నం మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించేలా కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు.
"కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మాజీ పార్లమెంట్ సభ్యుడని ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే పోటీ నుంచి వెళ్లిపోతా అన్నారు. నేను మీకు ఒక్కటే సవాల్ చేస్తున్నాను. పది సంవత్సరాల్లో బీజేపీ ఎన్ని హమీలను అమలు చేసింది? రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలు పూర్తి చేసిందా? గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలు అమలు చేస్తే మేము కూడా పోటీ నుంచి తప్పుకుంటాం." - పొన్నం ప్రభాకర్, మంత్రి