Ponguleti visit to Joint Khammam District : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పాలనపై బురదజల్లే ప్రచారాలు చేస్తున్నారని, రైతాంగంపై కపట ప్రేమ చూపుతూ రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాల్లో పర్యటించిన ఆయన, గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో పార్లమెంట్ ఎన్నికలు, ప్రజా సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 'పవర్ షట్ డౌన్' చేయాలని కుట్ర చేశారు : పొంగులేటి
ఆ విషయాలు గుర్తుంచుకోవాలి : ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాభావం వల్ల నీటి ఎద్దడి ఏర్పడితే, భారత రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న మంత్రి, బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు కూతవేటు దూరం వెళ్లి కరవు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలవకపోవడానికి కారణం ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు. కేవలం 56 శాతం వర్షాలు మాత్రమే కురిసినట్లు అక్టోబర్‌లోనే త్రిమాన్ కమిటీ, కేఆర్‌ఎంబీలకు లేఖలు రాసిన రోజులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పాలనపై బురదజల్లే ప్రచారాలు చేస్తున్నారు. రైతాంగంపై కపట ప్రేమ చూపుతూ రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాభావం వల్ల నీటి ఎద్దడి ఏర్పడితే, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. - మంత్రి పొంగులేటి
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేయలేదు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
చుక్క నీరు వృథా కానివ్వం : మిషన్ భగీరథతో భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బందులే ఉండవని రూ.కోట్లు ఖర్చు చేశారని, ఆ ప్రాజెక్టు ద్వారా ఎంత వరకు మేలు జరుగుతుందో చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్‌లో ఉన్న కొద్దిపాటి నీటిని తాగు నీటి కోసం వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. పార్టీ శ్రేణులు గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా పర్యవేక్షించాలని కోరారు. ఈ క్రమంలోనే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలే రిపీట్ కాబోతున్నాయని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు.
మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటి
కాంగ్రెస్ గెలుపునకు తెలుగు తమ్ముళ్లు చేసిన కృషి మరవలేనిది : పొంగులేటి