Minister Ponguleti Comments On State Capital : భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారిని నేడు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి, మాడవీధుల అభివృద్ధి పనులపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆలయ మాఢవీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని చెప్పారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. సర్వే చేయించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి చెప్పారు. మరోవైపు జలాశయానికి సంబంధించిన వివరాలను అధికారులను అడగగా సరిగా స్పందించకపోవడంతో అధికారుల తీరుపై మంత్రి మండిపడ్డారు.
రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి : ఈ క్రమంలోనే మంత్రి రాష్ట్ర రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు నగరంలోని పలు అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. త్వరలోనే నగరంలోని కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు.
"వరంగల్ నగరాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దానిలో భాగంగా భద్రకాళి టెంపుల్‌కు సంబంధించిన మాఢవీధులు, ఆలయానికి ఆనుకుని ఉన్న లేక్‌ను డెవలప్ చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాకుండా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. భద్రకాళి జలాశయాన్ని పూర్తిస్థాయిలో తాగునీటి జలాశయంగా మారుస్తాం. త్వరలో సర్వే నిర్వహించి, భద్రకాళి జలాశయం ఆక్రమణలు తొలగిస్తాం. అలానే వరంగల్ నగరవాసులకే కాకుండా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన ఒక మంచి విమానాశ్రయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతోంది." -పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి
పేదల పెన్నిధిగా త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం : మంత్రి పొంగులేటి