Minister Ponguleti Initiates Khammam Development Works : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే గువ్వలగూడెంలో రూ.10 లక్షల విలువ చేసే అంతర్గత సీసీ రోడ్లు, పల్లె దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ ఏడాది కురిసిన వర్షాలకు నదులు నిండటంతో కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రైతన్నలు వ్యవసాయ సాగును విస్తారంగా సాగించి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ నెల చివరి కల్లా రూ.24 వేల కోట్లతో ఇందిరమ్మ ఇల్లు : ప్రభుత్వ భూమిని పేదలకు పంచి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని, ఈ నెల చివరి కల్లా రూ.24 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడతామని పునరుద్ఘాటించారు. పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, నెల రోజుల వ్యవధిలోనే రూ.32 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశామని మంత్రి అన్నారు.
Minister Ponguleti visit to Khammam : ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని చెప్పినట్లు వివరించిన మంత్రి, ఆ దిశగానే రద్దు చేసి మంచి సంస్కరణలతో భూసంస్కరణలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కాకముందే ప్రతిపక్షాలు హస్తం పార్టీపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి నిర్ణయం మారడం లేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం కోసం శాసనసభలో అనేక గందరగోళాలు సృష్టించారని మంత్రి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమ్య, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ ఛైర్మన్ శాఖమూరి రమేశ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.