Komatireddy Venkat Reddy Allegations On MLA Jagadish Reddy : అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలు నువ్వానేనా అన్నట్లుగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. జగదీశ్వర్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడంటూ కోమటిరెడ్డి ఆరోపించగా, మంత్రి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ జగదీశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.
Telangana Assembly Sessions 2024 : జగదీశ్వర్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడంటూ మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో ఆయన ఏ2గా ఉన్నారని, భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో జగదీశ్వర్‌రెడ్డి, ఆయన తండ్రి ఏ6, ఏ7గా ఉన్నారని ఆరోపించారు. రామ్‌రెడ్డి హత్య కేసులో ఏ3 అన తీవ్ర ఆరోపణలు చేశారు. జగదీశ్వర్‌రెడ్డిని ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెట్రోల్‌బంక్‌లో జరిగిన దొంగతనం కేసులో కూడా ఆయన నిందితుడని పేర్కొన్నారు.
ముక్కు నేలకు రాస్తా : కోమటిరెడ్డి ఆరోపణలు తిప్పికొట్టిన జగదీశ్ రెడ్డి, తనపై ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారని, కాంగ్రెస్ పెట్టిన మూడు కేసుల్లో కోర్టులు తనను నిర్దోషిగా తేల్చిందని తెలిపారు. మంత్రి మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. రాజీనామా చేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రానని పేర్కొన్నారు.
తనపై ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సీఎం ఇద్దరు ముక్కు నేలకు రాయాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగదీశ్వర్‌రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. జగదీశ్వర్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తానన్నారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.