Minister Kollu Ravindra on Irregularities in Liquor Policy: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ తన బినామీలు, సొంత కంపెనీలకు వేల కోట్లు దోచి పెట్టారని మండిపడ్డారు. మద్యం విధానం వల్ల గడచిన ఐదేళ్లలో రాష్ట్రం 18 వేల 860 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం వల్ల వేలాది మంది ప్రజలు అస్వస్తతకు గురయ్యారని, వందల మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. శాసన మండలిలో అబ్కారీ శాఖపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.
వైఎస్సార్సీపీ సర్కారు మద్య నియంత్రణ పేరిట మద్యం రేట్లు విపరీతంగా పెంచి దోచుకుంది మంత్రి రవీంద్ర ఆరోపించారు. దీని వల్ల మద్యం వినియోగం, కొనుగోలు తగ్గాయని, వారంతా పక్క రాష్ట్రాల్లో కొనుగోలు చేయడం వల్ల అక్కడి ఆదాయం పెరిగిందని తెలిపారు. వైఎస్సార్సీపీ సర్కారు ఎక్సైజ్ విభాగాన్ని రెండుగా విభజించి నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ఎస్ఈబీ పేరిట ఎక్సైజ్ విభాగం సిబ్బందిని తరలించి పర్యవేక్షణ, తనిఖీలను గాలికి వదిలేసిందని తెలిపారు.
అమరావతిలో నిర్మాణాలు ఎలా ఉన్నాయి?- అధ్యయనానికి సాంకేతిక కమిటీ నియామకం - Committee on capital region
తనిఖీలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో నాసిరకం, కల్తీ మద్యం విచ్చల విడిగా సరఫరా అయిందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. పేరొందిన బ్రాండ్లను రాష్ట్రం నుంచి తొలగించి 26 సొంత కంపెనీల్లో తయారు చేసిన నాసిరకం మద్యాన్ని ప్రజల చేత తాగించారని శాసన మండలి సభ్యులకు తెలిపారు. నాసిరకం మద్యంతో అనారోగ్యానికి గురై ప్రజలు మృత్యువాత పడ్డారని, విచ్చలవిడిగా మద్యం పంపిణీతో తాగుడు పెరిగి రాష్ట్రంలో 20 శాతం క్రైం రేట్ పెరిగిందని తెలిపారు. అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానం వల్ల ఐదేళ్లలో రాష్ట్రం 18 వేల 860 కోట్లు ఆదాయాన్ని కోల్పోయింది. అంతే కాకుండా నాసిరకం మద్యం వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారు. జగన్ సర్కారు మద్య నియంత్రణ పేరిట మద్యం రేట్లు విపరీతంగా పెంచి అక్రమంగా డబ్బులు దోచుకుంది.- కొల్లు రవీంద్ర, మంత్రి