Minister Jupally Krishna Rao React on BRS MLC Winning : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ గెలుపు సాంకేతికం మాత్రమేనని, నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గులాబీ పార్టీ మాదిరిగా కాంగ్రెస్ తప్పుడు పద్ధతులు, ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1437 ఓట్లు నమోదైతే బీఆర్ఎస్కి 763, కాంగ్రెస్‌కి 652 వచ్చాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని తెలిపారు.
Minister Jupally on Mahabubnagar MLC Election : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్లమెంటు ఎన్నికల తీర్పు తర్వాత మాట్లాడాలన్న, మరో 48 గంటల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని జూపల్లి జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత గులాబీ పార్టీలో ఎవరూ మిగలరని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
"కాంగ్రెస్‌కు 340 నుంచి 652 ఓట్లు వరకు పెరిగింది. ఓటమి పాలయినట్టు కాదు, నైతికంగా మేము విజయం సాధించాం. ప్రజలు ఓటు వేసిన తీర్పు మరో 48 గంటల్లో వస్తుంది. తెలంగాణలో అధిక సీట్లు కాంగ్రెస్‌కే వస్తాయి. బీఆర్ఎస్ పతనం శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభం అయింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ భూస్థాపితం అవుతుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఎన్నికలు ఏవి జరిగినా కాంగ్రెస్ గెలుస్తుంది." - జూపల్లి కృష్ణారావు, మంత్రి
Congress Reaction on BRS MLC Winning : బీఆర్ఎస్ విజయం సాధించాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలయింది అన్న కేటీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. సముద్రంలో మునిగిపోయే వ్యక్తికి గడ్డిపోచ దొరికినట్లు బీఆర్ఎస్కి ఎమ్మెల్సీ దక్కిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు విజయం కాదని ప్రజామోదం కాంగ్రెస్‌కే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.