Minister Jupalli on Wanaparthy BRS Leader Murder : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ నేత హత్యపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన, పూర్తి వివరాలు తెలియకుండా హత్య కేసులో తన హస్తం ఉందని కేటీఆర్ ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. మృతుడు శ్రీధర్ రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన, శ్రీధర్ రెడ్డి మర్డర్‌పై భారత్ రాష్ట్ర సమితి నిరాధార ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలోనే గతంలో తమ కార్యకర్తలు చనిపోతే తాను ఇలా ఆరోపణలు చేయలేదన్న మంత్రి జూపల్లి, హత్యలను రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. శ్రీధర్ రెడ్డికి ఆయన కుటుంబంతోనే తగాదాలు ఉన్నాయని, హత్య ఘటనలో ఎవరి ప్రమేయం ఉందో పోలీసులు తేలుస్తారన్నారు. కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి, శ్రీధర్ రెడ్డి హత్యపై సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు కేటీఆర్, ప్రవీణ్ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
"శ్రీధర్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదు. అతడి వల్ల ఆ ప్రాంతంలో చాలా కుటుంబాలు బాధపడ్డాయి. మృతుడి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి. హత్య ఘటనపై పూర్తి విచారణ చేయిస్తాం. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నాపై కక్ష గట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అవగాహన లేకుండా మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాను." - జూపల్లి కృష్ణారావు, మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేసినందుకు, ప్రజలు వాళ్లను అధికారంలో నుంచి బర్తరఫ్ చేశారని జూపల్లి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే అంశాలు లేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి హత్య ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టినా తనకు ఇబ్బంది లేదన్న ఆయన, కేటీఆర్, ప్రవీణ్ కుమార్‌లు నిజాయితీగా మాట్లాడాలని హితవు పలికారు. ఏది పడితే అది మాట్లాడి, తనపై బురద చల్లాలని చూస్తున్నారని, ఇంకోసారి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.