YSRCP MLA Pinnelli Approached AP High Court : ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకోవటంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు.
మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. బుధవారం హైదరాబాద్‌లో పిన్నెల్లి కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆయన డ్రైవర్, గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా పిన్నెల్లి సహా పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌పైనా ఆదేశాలిచ్చింది.
అసలేం జరిగింది : ఏపీలోని మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేటు గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంను బద్దలు కొట్టి వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు పిన్నెల్లిని మొదటి నిందితుడిగా చేర్చింది. మూడు చట్టాల కింద 10 తీవ్ర సెక్షన్లతో కేసు నమోదు చేసింది. గరిష్ఠంగా ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలని ఈసీ పోలీసులకు ఆదేశించింది. అయితే అతను మాత్రం పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు.
డీజీపీకి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు : మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతల బృందం డీజీపీని కలిసి మెమోరాండం ఇచ్చారు. పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఫుటేజ్‌ను డీజీపికి అందించారు. తప్పించుకుని తిరుగుతున్న వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మెల్యేను వెంటనే పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.