Lok Sabha Elections 2024 : చిన్నపిల్లలు పాఠశాలలో చేరే ముందు వారి పూర్తి సమాచారాన్ని తల్లిదండ్రులు ఏ విధంగా ఉపాధ్యాయులకు అందజేస్తారో అలానే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి వారి సమాచారాన్ని తెలియజేయాలి. ఇందులో అభ్యర్థి స్థిర, చరాస్తుల వివరాలు, కేసుల సమాచారం తదితర అంశాలను పొందుపరచాలి. ఏమైనా తప్పుడు సమాచారాన్ని ఇచ్చామని ప్రత్యర్థులు గుర్తిస్తే ఆయుధంగా మారే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల్లో విలువైన వాటిలో అఫిడివిట్(ప్రమాణ పత్రం) ఒకటి. కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారాన్ని(Wrong Information in Affidavit) ఇచ్చారని తెలిస్తే ఆ అభ్యర్థి అనర్హత వేటుకు దారితీయొచ్చు. లోక్‌సభ ఎన్నికల వేళ అభ్యర్థులు అఫిడవిట్‌ను ఎలా నింపాలో ఓసారి తెలుసుకుందామా?
Lok Sabha Election Affidavit : స్థిర, చరాస్తుల వివరాలతో పాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్, బీమా పాలసీలు, అప్పులు తదితరాలు పొందుపర్చాలి. వాహనాలు, వాణిజ్య స్థలాలు, ఆభరణాలు, వ్యవసాయ భూములు, నివాస స్థలాల వంటి వాటిని అఫిడవిట్లో ప్రస్తావించాలి. వారసత్వంగా వచ్చాయా, కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను అందులో వివరించాలి. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల రుణాలు, ఆదాయ మార్గాలు గురించి అందులో వివరించాలి. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు బయటపెట్టాలి.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హీట్ - ప్రచారాల్లో జోరు పెంచిన ప్రధాన పార్టీలు - LOK SABHA ELECTIONS 2024
అభ్యర్థిపై ఏదైనా కేసులు, క్రిమినల్ కేసులు, న్యాయ స్థానాలు శిక్ష విధించినా తదితర అంశాలను, సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలపాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్‌కు నోటరీ తప్పని సరి. సాధారణంగా నామినేషన్ దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటనలివ్వాలి.
Farm-26 Importance : అఫిడివిట్లోని ఏ ఒక్క కాలమ్ ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధం లేని కాలంలో వర్తించదు లేదా నిల్ అని రాయాలని ఈసీ సూచించింది. అభ్యర్థి ఇచ్చిన ప్రమాణపత్రాన్ని గమనించి ఏదైనా సమాచారం లేకపోతే ఆర్వో నోటీసు ఇస్తారు. అప్పుడు సవరించిన అఫిడవిట్(Details in Affidavit)ను అభ్యర్థి ఈసీకి అందించాలి.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హీట్ - ప్రచార వేగం పెంచిన పార్టీలు - LOK sabha Polls 2024
అయినప్పటికీ పూర్తిస్థాయి వివరాలతో అఫిడవిట్ లేకపోతే పరిశీలన (స్క్రుటినీ) సమయంలో నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. అభ్యర్థులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను ఆర్‌వోలు నోటీసు బోర్డు, వెబ్‌సైట్లో పొందుపరుస్తారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అప్పుడే అభ్యర్థులపై ఓ స్పష్టత వస్తుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఫాం- 26 రూపంలో అభ్యర్థులు ప్రమాణపత్రం సమర్పించాలి.
అఫడివిట్‌లో సరైన సమాచారం ఇవ్వకపోతే ప్రత్యర్థి కోర్టులో కేసు వేయవచ్చు. ఇలానే రాష్ట్రంలో ఓ ఘటన జరిగింది. 2018 ఎన్నికల సమయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao vs Venkata Rao Case) తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు ఓడిపోయిన ప్రత్యర్థి జలగం వెంకటరావు 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేళ్ల విచారణ తర్వాత నిర్ధారించి ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని స్పష్టం చేస్తూ 2023లో వనమాపై హైకోర్టు అనర్హత వేటు వేస్తూ తీర్పునిచ్చింది. దీనిపై సదరు ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.