Lok Sabha Election Nominations Today 2024 : రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల సమరంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది (Notification Release). నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంటులో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది.
ఈ ప్రక్రియ నేటి నుంచి ఈనెల 25 వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ నిర్వహించి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్లతో పాటు కంటోన్మెంట్ ఓట్ల లెక్కింపు కూడా జూన్ 4న జరగనుంది..
అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచనలు :
- నామినేషన్లు స్వీకరించేటప్పుడు సెలవు దినాల్లో స్వీకరించరు.
- రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల లోపు మూడు వాహనాలకు మించి అనుమతి ఉండదు.
- నామినేషన్ వేసే అభ్యర్థి సహా నలుగురు వ్యక్తులకు మాత్రమే లోనికి అనుమతిస్తారు.
- కార్యాలయం లోపల, పరిసరాల్లో వీడియో కెమెరా లేదా సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు.
- అభ్యర్థులు నామినేషన్లను సువిధ పోర్టల్(Suvidha Portal) ద్వారా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించిన తర్వాత దాని ప్రతిపై సంతకం చేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది.
Lok Sabha Election 2024 : అభ్యర్థులు నామినేషన్‌తో పాటు కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. అఫిడవిట్ లోని ఆస్తులు, నేర చరిత్ర తదితర వివరాలన్నీ నింపాలని ఈసీ స్పష్టం చేసింది. పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఏ, బీ ఫారాలను నామినేషన్ల దాఖలుకు చివరి రోజు మూడు గంటల్లోపు సమర్పించాలి. లోక్‌సభకు పోటీ చేసేందుకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలయితే రూ.12,500 చెల్లించాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad by Elections)కు పోటీ చేసే అభ్యర్థులు రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలను కూడా నామినేషన్‌తో పాటు సమర్పించాలని ఈసీ తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్
అలా చేయకపోతే నోటీసులే : గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థిని ఒకరు, స్వతంత్రులకు పది మంది అదే నియోజకవర్గానికి చెందినవారు ప్రతిపాదించాలి. నామినేషన్‌తో పాటు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రతులను రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. అఫిడవిట్లను 24 గంటల్లోపు వెబ్సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ అసంపూర్తిగా ఉంటే ఆ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసు ఇస్తారు. నామినేషను వేసినప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది. ఖర్చుల వివరాలన్నీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.
అధికారులకు సీఈవో సూచనలు : నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఆర్వోలు, ఏఆర్వోలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సీఈవో వికాస్ అప్రమత్తం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే సుమారు రూ.130 కోట్లలకు పైగా విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మరింత నిఘా పెంచేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు నేటి నుంచి రంగంలోకి దిగనున్నారు.
చేరికలను ఆహ్వానిస్తూ, బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తూ - 'పార్లమెంట్'లోనూ హస్తం 'అసెంబ్లీ' స్ట్రాటజీ
ఈసారి బీజేపీకి 150 సీట్లే- మోదీ గురించి దేశమంతా తెలుసు: రాహుల్