Lok Sabha Election Campaign in Telangana 2024 : సార్వత్రిక సమరం హోరాహోరీగా సాగుతోంది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. లోక్‌సభ స్థానం సహా కంటోన్మెంట్‌లో ఉపఎన్నికలోనూ కాంగ్రెస్‌ను ఆదరించాలని ఆమె కోరారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి జానారెడ్డి సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.
Congress Election Campaign in Telangana : భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని వలిగొండలో కార్యకర్తల సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని కోరుట్లలో ఇవాళ నిర్వహించనున్న జన జాతర సభ ఏర్పాట్లను కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి పరిశీలించారు. ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. పదేళ్లపాటు ఎలాంటి అభివృద్ధి చేయని బీజేపీ, బీఆర్ఎస్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"పది సంవత్సరాలు పాలన చేసిన బీఆరఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తానని చెప్పింది. కనీసం గజం స్థలం కూడా ఇవ్వలేదు. అలాంటి పార్టీకి మళ్లీ ఓటు ఎందుకు వెయ్యాలి. దేశంలో కాంగ్రెస్ ఆదాయం సమకూర్చి ఇస్తే వాటిని బీజేపీ నాశనం చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
రాష్ట్రంలో రాజకీయ వే"ఢీ"- ఫుల్ స్వింగ్‌లో ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024
BRS Election Campaign in Telangana : చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శంకర్‌పల్లిలో బీఆర్ఎస్ కర్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా సూర్యాపేటలో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆటో కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఆటో నడిపి శ్రేణులను ఉత్సాహపరిచారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉదయం లేస్తే తిట్లు లేకుంటే అబద్ధాలతోనే రోజు నడుస్తోందని విమర్శించారు.
Telangana BJP Leaders Campaign : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. మల్కాజిగిరిలో ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ తలకిందులుగా తపస్సు చేసినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రాహుల్‌గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని విమర్శించారు. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా గోదావరిఖనిలో జిల్లా పార్టీ అధ్యక్షులు సునీల్ రెడ్డి, కందుల సంధ్యారాణి ఇంటింటి ప్రచారం చేపట్టారు. వినూత్న రీతిలో చెప్పులు కుడుతూ, బట్టలు ఇస్త్రీ చేస్తూ ప్రచారం చేపట్టారు.
MIM Election Campaign in Hyderabad : భువనగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య యాదగిరిగుట్టలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ కమలం పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే రామారావు పటేల్, పాయల్ శంకర్ నిర్మల్ జిల్లా భైంసాలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం జరుగుతోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాకుత్‌పురా, సంతోశ్‌నగర్ డివిజన్‌లో పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని పతంగి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు.