Lepakshi Knowledge Hub Land Scam: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీల్లోకి నిధులు పారించుకున్న జగన్‌పై సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో ఒకటి లేపాక్షి నాలెడ్జ్ హబ్! వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అనంతపురం జిల్లాలో బెంగళూరు హైవేపై ఉన్న విలువైన భూములపై జగన్ సన్నిహితుడు శ్యాంప్రసాద్‌రెడ్డి కన్నేశారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేసి, 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందుకోసం చిలమత్తూరు మండలంలో 10 వేల ఎకరాల భూములు కావాలని ఆ సంస్థ ఎండీ ఎస్.బాలాజీతో 2008 మార్చి 24న APIICకి లేఖ రాయించారు. అడిగినదానికంటే అదనంగా ఇచ్చేందుకు అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి సిద్ధపడ్డారు. 11,352 ఎకరాల ప్రభుత్వ, ఎసైన్డ్ భూములను హబ్‌కు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.
అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.శామ్యూల్, APIIC ఎండీ బీపీ ఆచార్య, ఈడీ మురళీధర్‌రెడ్డి కలిసి 8,844 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. దానికి గాను లేపాక్షి చెల్లించింది కేవలం 119 కోట్లే. ఎకరా 15 లక్షలు అనుకున్నా 8,844 ఎకరాలకు రూ.1,326 కోట్లు చెల్లించాల్సి ఉందన్నది సీబీఐ లెక్క! కానీ 119 కోట్లే ఇవ్వడంతో APIICకి 12 వందల 7 కోట్ల రూపాయల నష్టం జరిగింది.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కంపెనీ పెట్టకముందే భూమాయకు తెరలేచింది. భూముల కోసం APIICకి లేపాక్షి సంస్థ లేఖ రాసింది 2008 మార్చి 24న! కానీ అది ఏర్పాటైందే మార్చి 26న! అదీ లక్ష రూపాయల క్యాపిటల్‌తో! అంటే సంస్థను రిజిస్టర్ చేయడానికి రెండ్రోజుల ముందే భూ దోపిడీకి పథకం వేశారు. అయితే భూకేటాయింపు ప్రక్రియ జరుగుతోందని, రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ‘లేపాక్షి’కి అప్పటి అధికారి మురళీధర్‌రెడ్డి అదేరోజు లేఖ కూడా రాసేశారు.
ఆ తర్వాతే చిలమత్తూరు మండలంలో 3,542 ఎకరాలు, గోరంట్ల మండలంలో 5,733 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్‌కు APIIC దరఖాస్తు చేసింది! ఆ తర్వాత భూముల కోసం రూ.105 కోట్లు డిపాజిట్ చేశామని, ఎకరా ప్రభుత్వ భూమికి రూ.50 వేలు, ఎసైన్డ్ భూమికి లక్షా 75 వేల చొప్పున ధర ఖరారు చేయాలంటూ పరిశ్రమల శాఖకు లేపాక్షి ఎండీ ఎస్.బాలాజీ 2008 అక్టోబరు 25న మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ సమర్పించారు!
నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్యాంబాబు అదేరోజు ఆమోదించారు. 2008 సెప్టెంబరు నుంచి 2009 ఫిబ్రవరి మధ్య 8,844 ఎకరాల్ని భూములను లేపాక్షికి అప్పగించారు. ఈ ప్రక్రియలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి, ముఖ్యకార్యదర్శి శ్యాంబాబు, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ కార్యదర్శి శామ్యూల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది సీబీఐ అభియోగం.
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కి భూములిచ్చి అటు సాగుకు, ఇటు ఉపాధికి దూరమైన రైతులు
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు ఇచ్చిన భూముల్ని గ్రూప్, సబ్సిడరీ కంపెనీలు మార్ట్‌గేజ్ చేయడానికి వీల్లేదు. ‘లేపాక్షి’ మాత్రం నాటి పెద్దల అండదండలతో 4,650 ఎకరాలు తాకట్టు పెట్టి 745 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. స్థిరాస్తి వ్యాపారం కోసం 2009-12 మధ్య 3 వేల 651 ఎకరాల్ని ఇతరులకు అమ్మేసుకుంది. మరోవైపు సెజ్‌కు ప్రాథమిక అనుమతి వచ్చిందని, బోర్డుకు డాక్యుమెంట్లు సమర్పించేందుకు రిజిస్టర్డ్ సేల్‌డీడ్ చేయాలని APIICకి బాలాజీ లేఖ రాశారు. ఆ వెంటనే లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సేల్‌డీడ్‌లూ జరిగాయి.
భూములు చదును చేయడానికి ఎకరాకు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని, అందుకే సర్వీసు ఛార్జీని భూమి ధరలో 15% నుంచి 1 శాతానికి తగ్గించాలని బాలాజీ APIICని కోరారు. ప్రభుత్వం ఆ ఛార్జీని 2 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఏపీఐఐసీకి మరో రూ.24.17 కోట్ల నష్టం జరిగింది! జగన్ ఒత్తిడితోనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో వివరించింది. ప్రతిఫలంగా శ్యాంప్రసాద్‌రెడ్డి నుంచి జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి 50 కోట్ల రూపాయలు, కార్మెల్ ఏషియాలోకి రూ.20 కోట్లు మళ్లించినట్లు తేల్చింది.
శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు అప్పనంగా భూమిని అప్పగించేసిన వైఎస్ సర్కార్, సోమశిల నుంచి నీళ్లూ కేటాయించింది. 2008 మే 7న సోమశిల తాగునీటి సరఫరాపై సీఎం హోదాలో సమావేశం నిర్వహించిన రాజశేఖర్ రెడ్జి, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 1.20 టీఎంసీలు కేటాయించాలని ఆదేశించారు. ఇలా చేస్తే తాగునీటి సరఫరాకు ఇబ్బందని అధికారులు అభ్యంతరం వ్యక్తంచేసినా లెక్కచేయకుండా జీవో జారీ చేయించారు.
Farmers Problems: లేపాక్షికి భూములిచ్చి దిక్కులేని వాళ్లయిన రైతులు.. ఎవరిని కదిపినా రోదన.. ఆవేదన
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ 2013 సెప్టెంబరు 17న CBI ఛార్జిషీటు దాఖలు చేసింది. ఎ1గా జగన్, ఎ2గా వి.విజయసాయిరెడ్డి, ఎ3గా శ్యాంప్రసాద్‌రెడ్డి, ఎ4గా ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎ5గా లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైలిమిటెడ్, ఎ6గా శ్రీనివాస్ బాలాజీ, ఎ7గా బీపీ ఆచార్య, ఎ8గా బి.శ్యాంబాబు, ఎ9గా జె.గీతారెడ్డి, ఎ10గా ఎం.శామ్యూల్, ఎ11గా ధర్మాన ప్రసాదరావు, ఎ12గా డి.మురళీధర్‌రెడ్డి, ఎ13గా బి.పి.కుమార్‌బాబు, ఎ14గా జగతి పబ్లికేషన్స్ పేర్లు చేర్చింది.
సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేపట్టిన ఈడీ.. 8 వేల 648 ఎకరాల లేపాక్షి భూములతోపాటు, 129 కోట్ల సొమ్మును 2015లో అటాచ్ చేసింది. భూములను విక్రయించగా వచ్చిన సొమ్ముతో మహారాష్ట్రలోని హింగనలో ఆసరా రియాల్టీ వెంచర్స్ పేరుతో శ్యాంప్రసాద్‌రెడ్డి రూ.11 కోట్ల విలువైన 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించి, వాటినీ తాత్కాలికంగా జప్తు చేసింది! కూకట్‌పల్లిలోని ఇందూ టౌన్‌షిప్ భూములనూ అటాచ్ చేసింది.
సీబీఐ ఛార్జిషీట్‌పై ఈ కేసు విచారణ కోర్టులో గత పదేళ్లలో 220 సార్లు, ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ 50 సార్లు విచారణ వాయిదా పడింది. IAS ఐఏఎస్ అధికారులైన శ్యాంబాబుపై నమోదైన కేసును 2017లో, మురళీధర్‌రెడ్డిపై ఉన్న కేసును 2023లో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. శ్యాంప్రసాద్‌రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన డిశ్ఛార్జి పిటిషన్‌ను, బాలాజీ తెలంగాణ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. మిగిలిన కేసులతో కలిపి నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.
Lepakshi Knowledge hub దివాలా మాటున దోపిడీ, అది జగన్ ప్రభావంతోనే జరిగిందని తేల్చిన సీబీఐ
సీబీఐ కేసులో నేరం రుజువైతే నిందితులకు గరిష్ఠంగా జీవితఖైదు పడొచ్చు. ఈడీ కేసులో నేరం రుజువైతే అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు పూర్తిస్థాయిలో జప్తు అవుతాయి. అవినీతి నిరోధక చట్టం కింద మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష కూడా పడుతుంది. క్రిమినల్ కేసుల్లో కనీసం రెండేళ్ల జైలుశిక్ష పడితే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత కోల్పోతారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా కొనసాగేందుకు అనర్హులవుతారు. శిక్షకాలం పూర్తయిన తర్వాత నుంచి ఆరేళ్ల వరకు ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు. కానీ విచారణలో వాయిదాల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకూ సీబీఐ కోర్టులో ఈ కేసు 220 సార్లు, ఈడీ కోర్టులో కేసు 50 సార్లు వాయిదా పడ్డాయి.
lepakshi lands issue: లేపాక్షి భూముల్లో జగన్నాటక సూత్రధారులకు ఎదురుదెబ్బ!