Kunamneni Sambasiva Rao Comments on Modi : బీజేపీ భయంకరమైన పార్టీగా తయారైందని, ఆధునిక నియంత పాలన, మతోన్మాదం వంటి అవలక్షణాలు కలిగిన వ్యక్తి నరేంద్ర మోదీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజల భక్తి, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని, రామ జపంపోయి మోదీ జపంగా మారిపోయిందని విమర్శించారు. ప్రధాని మోదీ శ్రీరాముని పేరుతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
భద్రాచలం గురించి మోదీకి ఏ మాత్రం పట్టదని, ఏడు మండలాలను ఏపీకి అప్పజెప్పారని ఎమ్మెల్యే కూనంనేని ఆరోపించారు. పెద్ద వరద వస్తే ఆలయం మునిగిపోతుందని అన్నారు. మోదీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు అడ్డు వచ్చిన వారిని తొలగించుకుంటూ పోతున్నారని విమర్శించారు. లిక్కర్ కేసులో సిసోడియాను (Manish Sisodia) అరెస్టు చేస్తే, ఇప్పటి వరకు బెయిల్ లేదని, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ను(Nitish Kumar) కూడా బెదిరించి లొంగదీసుకున్నారని వ్యాఖ్యానించారు. మోదీకి అనుకూలంగా ఉండే వారిని వదిలేసి, వ్యతిరేకించే వారిని బెదిరిస్తున్నారని కూనంనేని ఆరోపించారు. మతం వేరు, రాజకీయాలు వేరని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
MLA Sambasiva rao about CPI National Conventions : హైదరాబాద్లో సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 2 నుంచి 4 వరకు జరగుతాయని కూనంనేని తెలిపారు. సీపీఐ సమావేశాల చివరి రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జాతీయ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొంటారని పేర్కొన్నారు. సీపీఐ కౌన్సిల్ సమావేశాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, కేరళ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వస్తున్నారని ఆయన వెల్లడించారు.
150 మంది మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించి, పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ పాత్ర ఎలా ఉండాలన్న దానిపై చర్చిస్తామని వివరించారు. కాంగ్రెస్తో (Congress) 5 ఎంపీ స్థానాలు ఇవ్వాలని చెప్పామని, ఏదైనా ఒక స్థానం కేటాయించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు చెల్లడం లేదని, ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తిరుపతి, తెలంగాణలో ఆందోళన చేపడతామన్నారు.
'రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం సంగతి ఏంటో తేల్చాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ను మొత్తం తొలగించాలని వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేశారో, ఎంత వృథా అయ్యాయో స్పష్టం చేయాలి. అఖిలపక్ష కమిటీతో పాటు నిపుణుల కమిటీని కాళేశ్వరం తీసుకుని వెళ్లాలి. ప్రాజెక్టులో నష్టపోయిన నిధులను కక్కించాలి.' - కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం - పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు