KTR Warning To Congress Leaders : ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు ఇస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంత్రితో పాటు ఇద్దరు నేతలు న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
MLA Yennam Srinivas Reddy on phone Tapping Case in Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను ఒక బాధితుడినేనని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలని డీజీపీ రవి గుప్తకు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ నాయకులు, ప్రశ్నించే గొంతులపై ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ట్యాపింగ్‌తో అప్పటి ప్రతిపక్ష నాయకులను నిర్భంధంలో పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ప్రణీత్‌రావు బృందం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుంచి పరికరాలు తీసుకువచ్చి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
అందుకు తన దగ్గర తగిన ఆధారాలున్నాయని, వాటిని డీజీపీకి సమర్పించారని ఆయన తెలిపారు. ప్రణీత్ రావు ముఠా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్లు పెట్టి, రాజధాని కేంద్రంగా ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. ఫోన్ టాపింగ్ దుర్మార్గమైన చర్యని, ఎవరి ఒత్తిడి వల్ల చేశారో తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy Counter To KTR : ఫోన్ ట్యాంపింగ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల రేవంత్ రెడ్డి స్పందించారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా భయపెట్టిందన్న సీఎం రేవంత్, భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ట్యాపింగ్‌తో విన్నారని ఆరోపించారు. ట్యాపింగ్ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ చేసిన వారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మాటలకు తగిన ఫలితం ఉంటుందని తెలిపారు.