KTR Election Campaign in Rajendranagar : రాష్ట్రంలో బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యమై కాసానిని గెలిపించాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గంలోని రాజేంద్రనగర్లో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొని, బీఆర్ఎస్ అభ్యర్థి కాసానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.
KTR Comments on BJP and Congress : అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి మరోసారి మోసగించేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హస్తం పార్టీ మోసం పార్ట్ -1 అని, పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-2 అని దుయ్యబట్టారు.
KTR on Chevella Constituency Speech : ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి కాంగ్రెస్ పార్టీ తెర తీస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఒకసారి మోసపోతే నాయకులది తప్పు అవుతుందని, రెండోసారి మోసపోతే ప్రజలదే తప్పు అవుతుందని అన్నారు. మరోసారి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల ప్రజలు బుద్ది చెప్పాలని కేటీఆర్ కోరారు. బలహీనవర్గాల బలమైన నాయకుడు కాసానిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఏడు నియోజవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీలో పాల్గొన్నారు.
చేవెళ్లలో గులాబీ జెండా మరోమారు ఎగరడం ఖాయం : కేటీఆర్ - KTR on Chevella Constituency
"మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. దీనికి తగిన బుద్ధి చెప్పాలి. బీజేపీని ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. బలహీనవర్గాలకు బలమైన గొంతుక అయిన కాసానిని గెలిపించాలి. 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటే రాష్ట్రంలో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉంటే కొంతమంది విడిచి వెళ్లారు. బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలవరని రాజకీయ పార్టీలు అపవాదులు సృష్టించాయి." - కేటీఆర్ , బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు