Victims of Lagacharla met KTR : లగచర్ల భూసేకరణ బాధితుల డిమాండ్లను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన లగచర్ల బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఆయనకు వివరించారు. కేటీఆర్ వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రజల అభ్యర్థన మేరకు ప్రభుత్వం వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్న ఆయన ఈ పోరాటంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం వేధింపులను మానుకొని బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లగచర్లలో భూసేకరణ ప్రక్రియ రద్దయ్యేంత వరకు తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, పోరాటం చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం లగచర్ల గిరిజనులపై అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా వెనక్కి తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం తగదని విమర్శించారు.
ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్ : వికారాబాద్ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన బాధితులపై పెట్టిన అక్రమ కేసుల పేరుతో పోలీసుల వేధింపులను నిలిపివేయాలని కోరారు. తమ భూముల కోసం న్యాయమైన పోరాటం చేస్తున్న బాధితులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు, పేద రైతుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ నిలబడుతుందని పునరుద్ఘాటించారు. లగచర్ల బాధితులు చేసిన పోరాటానికి తలవంచి ప్రభుత్వం దిగి వచ్చి నోటిఫికేషన్ రద్దు చేసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.
మళ్లీ అవే భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో సేకరించొద్దని, నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల భూములను వదిలేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను పరిశ్రమల కోసం ఉపయోగించాలని కేటీఆర్ అన్నారు. గిరిజనుల భూములు లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ కేసులతో జైల్లో ఉన్నా, బాధితుల న్యాయపోరాటానికి బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని చూస్తే చరిత్ర క్షమించదు : కేటీఆర్
అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారు : కేటీఆర్