KTR on Graduate MLC Election in Telangana :హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం విషయంలో బీజేపీ ఆలోచన ఏమిటో, అవగాహన లేకుండా మాట్లాడేది ఎవరో జూన్ నాలుగో తేదీ తర్వాత తెలుస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాదన చిత్తు కాగితం అని రిజర్వ్ బ్యాంక్ తేల్చిందన్నారు. నిన్నటి వరకు అప్పు చేయడం తప్పు అని సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
KTR on Farmers Problems : రాష్ట్ర ఆదాయం ఎక్కడకు పొతోందని కేటీఆర్ ప్రశ్నించారు. గుత్తేదార్లకు పోతున్నాయా? ఇంకా ఎక్కడికైనా పొతున్నాయా అని అడిగారు. అప్పుల విషయంలో సీఎం, ఉపముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను పూర్తిగా విస్మరించి రాజకీయాలు మాత్రమే చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల్లో అన్నారన్న ముఖమంత్రి, అకాల వర్షాలతో నష్టపోయి రైతులు కష్టాల్లో ఉన్నారని, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగలేదని, పర్యవేక్షణ లేక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండడంతో రోజుల తరబడి కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం నానుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోళ్లను పర్యవేక్షించాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరపున రోడ్డెక్కి పోరాడతామన్న హెచ్చరించారు.
KTR Review Meeting on MLC By Election : నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల స్థానంలో జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపొందిందని, ఎమ్మెల్సీ ఉపఎన్నికలో విద్యావంతుడు, యువకుడు రాకేశ్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు విని, ఏమైందో చూస్తున్నారని కేటీఆర్ తెలిపారు. మెగా డీఎస్సీ అని దగా చేశారని, జాబ్ కేలండర్ అన్నారు, అతీగతీ లేదని ఆక్షేపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలను పోల్చుకొని రాకేశ్ రెడ్డికి మద్దతు పలకాలని కోరారు.
మాజీ సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులను ఒక్కమాట కూడా అనలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడం రేవంత్ రెడ్డికి తగదన్న హెచ్చరించారు. నారాయణఖేడ్‌లో ఉపాధ్యాయులపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పదేళ్ల కేసీఆర్ పాలన మీరంతా చూశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యకళాశాలలు ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు తానే ఇచ్చానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలి. ఒక బ్లాక్ మెయిలర్‌ను ఎన్నుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అటువంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే మరో నయీంను తయారు చేసినట్లవుతుంది." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు