KTR Meeting with BRS Leaders on MLC By Election : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలకపాత్ర అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను కూడా ఓటర్లు పరిశీలించాలని ఈ సందర్భంగా చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి విజయం కోసం అందరం శ్రమించాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి విజయం కోసం అందరం శ్రమించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. భువనగిరి బీఆర్ఎస్ నేతలు రాకేశ్‌రెడ్డి విజయం కోసం కష్టపడాలని కోరారు. రాకేశ్‌రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారని తెలిపారు. బిట్స్ పిలానీలో చదివిన ఉన్నత విద్యావంతుడని కొనియాడారు. సొంత గడ్డపై ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఈ శాసనమండలి ఎన్నిక ఐదు రకాలుగా జరుగుతుందని పార్టీ శ్రేణులకు వివరించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని అందరికీ కేటీఆర్ పరిచయం చేశారు.
పదేళ్ల మోదీ పాలనలో పెద్దగా జరిగిందేమీ లేదు : అనంతరం ప్రధాని మోదీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గతంలో మోదీ అన్నారని గుర్తు చేసి, అనంతరం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇలా ఎన్నో చెప్పారన్నారు. కానీ చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ పదేళ్ల పాలనలో పెద్దగా జరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. అలాగే సామాన్యులకు ఒరిగిందేమీ లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత వారం రోజులుగా బిజీబిజీగా కేటీఆర్ : గత వారం రోజులుగా కేటీఆర్ ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీటింగ్‌లు నిర్వహిస్తూ, నేతలను సమీకరిస్తూ, ఎక్కడైనా పొరపాట్లు లాంటివి జరిగితే వాటిని సరిదిద్దుకునే విధంగా ముందుకు పోవాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.
"ఈనెల 27 పోలింగ్, ఈనెల 25నాడు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. రాకేశ్ రెడ్డి అభ్యర్థిగా మూడు జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక జరుగుతుంది. 4.73 లక్షల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఒక్కొక్క ఓటరును కొలవడం సాధ్యం కాదు. విద్యావంతుల సమస్యలను, గ్రాడ్యుయేట్ల సమస్యలను తెలుసుకోవడానికి ఒక ఎమ్మెల్సీ ఉండాలి. మనం ఎవరికి ఓటేస్తున్నాము చూసుకుంటూ పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను కూడా ఓటర్లు పరిశీలించాలి. ఒకసారి ఆలోచించి ఓటేయాలి." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కే అనుకూలం : కేటీఆర్ - KTR on BRS Victory