KTR meeting with party workers : అమ్మలాంటి పార్టీ మీద ఇవాళ కొంత మంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒక్కసీటు కూడా గెలవదని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని గుర్తుచేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్ రెండు సీట్లు గెలిస్తే మంత్రి పదవి వదిలిపెడతానని సవాలు చేశారని, బండి సంజయ్ వినోద్ కుమార్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చేసే సవాలను కరీంనగర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గుర్తు చేశారు.
KTR On BRS Government : మన ప్రభుత్వం అధికారం కోల్పోయి 145 రోజులు అయిందని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారు ఉంటే ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడే వారు కాదని ఇప్పటి వరకు దాదాపు 100 సార్లు అనుకున్నానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు అమల్లో ఉండుంటే మరింత అభివృద్ధి జరిగేదని గుర్తు చేసుకున్నానని తెలిపారు. మానేరు రివర్‌ఫ్రంట్ పనులు ముందుకు సాగలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇప్పటికే గంగుల కమలాకర్ పోటీ పడి నిధులు తీసుకు వచ్చేవారని పేర్కొన్నారు. కరీంనగర్ అంతర్జాతీయ నగరాలతో పోటీపడే పరిస్థితి ఉండేదని కార్యకర్తలకు తెలిపారు.
"మన ప్రభుత్వం ఉండుంటే ఇప్పుడు వేసవి కాలం పనులు చేపట్టాల్సి ఉండేది. కానీ పనులు నిలిచిపోయాయి అవన్నీ చూసుకుంటూ వచ్చా. పరిస్థితి ఎలా ఉందని గంగుల కమలాకర్‌ను అడిగితే. పోలీసుల వేధింపులు ఉన్నాయి. అక్కడక్కడ కేసులు పెట్టి వేధిస్తున్నారని సమాధానం చెప్పారు. నేను మీ అందరికి ఒకటే చెబుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
రాష్ట్ర రాజకీయాల్ని శాసించవచ్చు : 'అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సున్నితంగా ఉన్న వారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తోకలు జాడిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే రాబోయే 15 రోజుల్లో కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ స్థానాలను గెలిస్తే, ఏడాదిలోగా రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు వార్డులో బీజేపీ కార్యకర్త ఒక్కడే ఉంటాడని, అన్ని పనులు వాడే చేసుకుంటాడని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు 200 మంది ఉంటారని, ఒకరికి పెత్తనం ఇస్తే మరోకరికి కోపం వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీజేపీ అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉంది : కేటీఆర్ - KTR ON BJP RESERVATION COMMENTS