KTR Interesting Comments on CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ 420 హామీలు ఇస్తే, భారతీయ జనతా పార్టీ రాముడి పేరిట మత విద్వేశాలను రెచ్చగొడుతుందని ఆక్షేపించారు. రాహుల్ గాంధీ బీజేపీ విధానాలను విమర్శిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించటం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు కావాలనే బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని దుష్ప్రచారం చేశారన్న కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు భయపడినట్లు తామేం రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చబోమని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మార్పు జరగబోతుందని జోస్యం చెప్పిన కేటీఆర్, రేవంత్ రెడ్డి 20, 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరటం ఖాయమని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లటమే అతి పెద్ద మార్పు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఆ మాటలను విస్మరించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడేమో పంద్రాగస్టులోపు చేస్తామని రేవంత్ చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పులతో సమాధానం చెప్పాలి. - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
రాముడు అందరికీ దేవుడే : దేశాన్ని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న బీజేపీ రాముడి పేరిట రాజకీయం చేస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు ఒక్క బీజేపీకే దేవుడు కాడని, అందరికీ ఆయన దేవుడేనన్నారు. ఈ క్రమంలోనే 'రాముడిని మొక్కుతాం - ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీని తొక్కుతాం' అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అప్పుడు పొగిడి, ఇప్పుడు తిడుతున్నారు : ఈ క్రమంలోనే పార్టీ వీడుతున్న వారి పట్ల మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన వారు, నేడు పక్క పార్టీల్లోకి వెళ్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇంద్రుడు, చంద్రుడు అన్న వారే, అధికారం పోయాక విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎవరు వెళ్లిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కార్యకర్తలే పార్టీకి బలమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీ ఏమైనట్టు : కేటీఆర్ - KTR On Congress BC Declaration
ప్రజలారా మేల్కొండి - వాళ్ల కుట్రలను అర్థం చేసుకోండి : కేటీఆర్ - Ambedkar Jayanthi Celebrations