KTR Fires CM Revanth Comments on Sabitha Indra Reddy : బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు.
అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని సీఎం నికృష్టంగా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లడటం శోచనీయమన్నారు. ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు.
Revanth Sensational Comments On MLA Sabitha : నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారని కానీ రేవంత్ ఆడబిడ్డలను అవమానించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడామని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నామన్న ఆయన, అది కేసీఆర్ నేర్పించిన సంస్కారం అన్నారు. అసెంబ్లీలో జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగినట్లు అని మాజీ మంత్రి అన్నారు. ఇకనైన ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడిన ముఖ్యమంత్రి, చివరకు సమాధానం చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు.
"మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కారు. సీఎం గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చిర్రు భట్టి. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు: ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రేపు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా, ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపై అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసులను నొప్పించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు.