KTR React on Civil AEE Jobs : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన సివిల్ విభాగంలో ఏఈఈ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే ప్రకటించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏఈఈ సివిల్ విభాగ పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందని వివరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.
— BRS Party (@BRSparty) July 3, 2024
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసి విన్నవించిన పరీక్ష రాసిన అభ్యర్థులు.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన… https://t.co/UjnnRGiUfZ pic.twitter.com/DvOmeLJajr
KTR Called TGPSC Chairman Mahender Reddy : ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు కేటీఆర్‌ను హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన ఇంట్లో కలిశారు. ఈ జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా వారికి అండగా ఉంటానని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. వెంటనే టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణమే ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కోరారు.
రేవంత్‌రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది : మరోవైపు కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఉరి వేసుకుని పల్లె యాదగిరి అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణమృదంగం మోగుతోందని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన పోరాట ఫలితమే కాళేశ్వరం : కేటీఆర్ - KTR on Kaleshwaram project