KTR Fires on CM Revanth About Musi Development Fund : రూ.లక్షా యాభై వేల కోట్లతో మూసీ అభివృద్ధికి చర్యలు చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు సంధించారు. తొలుత రూ.50,000 కోట్లు, తర్వాత రూ.70,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, ఇప్పుడు ఏకంగా రూ.లక్షా యాభై వేల కోట్లు అని చెప్పడం వెనక ఉద్దేశమేంటని కేటీఆర్ సామాజిక మాద్యమం ఎక్స్‌లో ప్రశ్నించారు.
తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు పెడితేనే గల్లీ నుంచి దిల్లీ వరకు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్, ఇప్పుడు మూసీ సుందరీకరణకే రూ.1.5 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందన్నారు. పదిహేను పక్కన ఇన్ని సున్నాలా!! 15,000,000,000,000 అని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మూసీని అందంగా
— KTR (@KTRBRS) July 21, 2024
ముస్తాబు చేసేందుకు..
మొన్న..
50 వేల కోట్లు అయితదన్నరు
నిన్న..
70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరు
నేడు..
లక్షా 50 వేల కోట్లు
ఖర్చు చేస్తామంటున్నరు
తెలంగాణ రైతుల తలరాతను మార్చిన
కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే
గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది… pic.twitter.com/DpiqFewWee
లండన్ థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి? : ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని? సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని? అని ప్రశ్నించారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రికి, ఎంతోమంది రైతులకు మేలు చేసే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కంటే మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకంత మక్కువని కేటీఆర్ నిలదీశారు.
చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి, కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం? లండన్‌లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి? గేమ్ ప్లాన్ ఏంటి? చెప్పండి ముఖ్యముఖ్యమంత్రి అని కేటీఆర్ ప్రశ్నించారు. మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం, కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం అని దుయ్యబట్టారు.
KTR Fires on Congress Govt : మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిందే, కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించం అని స్పష్టం చేశారు. తట్టెడు మన్ను తీయకముందే, రూ. కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించమన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట, బ్యాక్ డోర్లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందని, కుంభకోణాల కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడుతుందన్నారు.