Rajiv Gandhi Statue Issue in Telangana : సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. 'చీప్ మినిస్టర్ రేవంత్, నా మాటలు గుర్తుంచుకోండి' అంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించిన ఆయన, భారత్ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన రోజే అంబేడ్కర్ సచివాలయం పరిసరాల్లో నుంచి చెత్తను తొలగిస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి లాంటి దిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమని వ్యాఖ్యానించారు. పాఠశాల విద్యార్థుల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. మానసిక రుగ్మత నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.
Mark my words Cheap Minister Revanth
— KTR (@KTRBRS) August 20, 2024
We will clear out the trash from the surroundings of Dr. B. R. Ambedkar secretariat the very same day we are back in office
Can’t expect a Delhi Ghulam like you to ever understand self-respect & pride of Telangana
Using filthy language in…
చీప్ మినిస్టర్ రేవంత్ నా మాటలు గుర్తుంచుకోండి. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రోజే అంబేడ్కర్ విగ్రహం వద్ద చెత్త తొలగిస్తాం. బీఆర్‌ఎస్ రాగానే సచివాలయం పరిసరాల్లో చెత్త తొలగిస్తాం. దిల్లీ గులాంలు రాష్ట్ర ఆత్మగౌరవం అర్థం చేసుకుంటారని ఆశించలేం. చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోంది. మానసిక రుగ్మత నుంచి రేవంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. - కేటీఆర్ ట్వీట్
లక్కీ లాటరీలా సీఎం పదవి : రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లక్కీ లాటరీలా తగిలిందని, అందుకే ఆ పదవికి ఉన్న ఔన్నత్యం తెలియడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యమ నేత కేసీఆర్‌పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు తగవని ఖండించారు. 'నడమంత్రపు సిరి - నరం మీద పుండులాంటిది' అని సామెత ఉందన్న ఆయన, తెలంగాణలో రేవంత్ పాలన, ప్రసంగాలు అందుకు తగ్గట్లుగానే సాగుతున్నాయని ఆక్షేపించారు. తెలంగాణ సోయి ఉన్న వాళ్లకే తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఉద్యమకారుల మీదకు తుపాకీ ఎక్కుపెట్టిన, వచ్చిన తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించి ఓటుకు నోటు కేసులో చిక్కిన రేవంత్ రెడ్డికి తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం గురించి తెలియదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు ముమ్మాటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతల దిల్లీ గులాంగిరీ, బానిస మనస్తత్వానికి ప్రతీకగానే కనిపిస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో అధికారంలోకి రాగానే ఆ బానిస చిహ్నాలు, మూలాలను ఏరేస్తామని తెలిపారు.
అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే : అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, చేతనైతే ఎవరైనా విగ్రహం మీద చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయినా, బలుపు తగ్గలేదని ధ్వజమెత్తారు. సచివాలయం ముందు కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే అధికారంలోకి వస్తే అని కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఇక తిరిగి అధికారంలోకి రావడం బీఆర్‌ఎస్‌కు కలే అని వ్యాఖ్యానించారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వీళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదన్న సీఎం, తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించనవసరం లేదని స్పష్టం చేశారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం, సామాజిక బహిష్కరణ చేస్తుందని హెచ్చరించారు.